- హైదరాబాద్ పాతనగరంలోని ఛత్రినాక ప్రాంతంలో ఒక ఇంటి మీటరుకు బైపాస్ పద్ధతిలో మరో వైరు కలిపి నేరుగా కరెంటు తీసుకుంటున్న దర్జా వ్యవహారమిది. ఇలా తీసుకునే కరెంటు.. మీటరులో నమోదు కాదు.. బిల్లు రాదని విద్యుత్ సిబ్బంది తనిఖీల్లో గుర్తించారు.
రాష్ట్రంలో గత ఏడాదికాలంలో రెండు డిస్కంల పరిధిలో ఏకంగా 81 వేల దొంగ కనెక్షన్లను విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. దాదాపు రూ. 48 కోట్ల విలువైన కరెంటును అక్రమంగా వాడుకున్నట్లు తేల్చారు. రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 2020 డిసెంబరు నుంచి 2021 నవంబరు వరకూ విజిలెన్స్ సిబ్బంది జరిపిన దాడుల్లో 59,522 దొంగ కనెక్షన్లను పట్టుకున్నారు. వీటి ద్వారా ఏడాదిలో చౌర్యం చేసిన కరెంటు విలువ రూ. 42.24 కోట్లుగా లెక్కతేల్చారు. ఇలాగే వరంగల్ కేంద్రంగా గల ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో గత ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ 17,099 దొంగ కనెక్షన్లను పట్టుకున్నారు. ఈ కరెంటు దొంగలకు రూ. 5.46 కోట్ల జరిమానా వేశారు. 2020-21లో ఇదే ఉత్తర డిస్కం పరిధిలో మొత్తం 30,978 దొంగ కనెక్షన్లు పట్టుకుని రూ. 6.68 కోట్ల జరిమానా విధించారు.
హైదరాబాద్ నడిబొడ్డున..
పల్లెల్లో కంటే పట్టణాలు, నగరాల్లోనే ఇళ్లు, పరిశ్రమలకు రూ.లక్షల విలువైన కరెంటు అక్రమంగా వాడేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ ఇంటిని తనిఖీ చేస్తే అక్కడ జరుగుతున్న విద్యుత్ చౌర్యం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఆ ఇంటికి ఉన్న మీటరు సీలును మార్చేసి లోపల బైపాస్ పద్ధతిలో రీడింగు నమోదు కాకుండా మరో తీగ నుంచి కరెంటు తీసుకుని వాడుకుంటున్నారు.
భూగర్భ కేబుల్ వ్యవస్థ!
సాధారణంగా కరెంటు కనెక్షన్ అంటే స్తంభం నుంచి తీగను మన ఇంటి దగ్గరకు లాగి మీటరుకు కలుపుతారనే అందరికీ తెలుసు. కానీ కరెంటు దొంగల రూటే వేరు. హైదరాబాద్ శివారు గంధంగూడలోని ఓ చిన్న పరిశ్రమకు ప్రతి నెలా తక్కువ బిల్లే వస్తుండటంతో అధికారులకు అనుమానమొచ్చి లోతుగా పరిశీలిస్తే అసలు బండారం బయటపడింది. మీటరు దగ్గర నుంచి మరో తీగను భూమి లోపలి నుంచి లాగి దర్జాగా కరెంటు వాడుకుంటున్నట్లు వెల్లడైంది. అందుకే సదరు పరిశ్రమకు బిల్లు చాలా తక్కువగా వస్తున్నట్లు తేలింది. ఆ పరిశ్రమ యజమానికి రూ. 6.10 లక్షల జరిమానా విధించారు.