NTPC Simhadri : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్లలోని విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం అత్యవసర మరమ్మతు పనుల్లో నిమగ్నమైంది. ఒకేసారి 4 యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడూ నిలిచిపోలేదు. గ్రిడ్ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్ సరఫరా కావడం లేదు. మరోవైపు అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆధారమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోయింది. దాదాపు రెండున్నర గంటల తర్వాత విజయనగరం జిల్లా మరడం 400 కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
Power Cut at NTPC Simhadri : పెదగంట్యాడ మండలం పాలవలస హిందూజా పవర్ ప్లాంట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1,040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో యంత్రాంగం పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. దక్షిణాది గ్రిడ్‌లో లోపం వల్లే సింహాద్రి, హిందూజా ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసరంగా ఇంజినీర్లందరూ విధులకు హాజరు కావాలని.. మొత్తం అన్ని విభాగాలకు ఎన్టీపీసీ ఆదేశాలు జారీ చేసింది. హుటాహుటిన నిపుణులు, సిబ్బంది ప్లాంట్‌కి చేరుకుంటున్నారు.