Electricity: ఎక్స్ఛేంజీలలో కొందామన్నా విద్యుత్తు దొరకట్లేదని.. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కోతలు విధిస్తున్నామని అధికారులు అంటున్నారు. కానీ.. పొరుగునే ఉన్న తమిళనాడు, తెలంగాణ రోజూ 90 ఎంయూలు కొంటున్నాయి. మరి ఏపీకి 55 ఎంయూలు కూడా ఎందుకు దొరకట్లేదు? డిస్కంలు చెబుతున్నది వాస్తవమేనా? చేతిలో డబ్బులు లేక విద్యుత్తు కొనడం లేదా?
మార్కెట్లో నిజంగానే దొరకట్లేదా?:
దేశంలో 3.80 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మొత్తం డిమాండు 2 లక్షల మెగావాట్లకు మించదు. అంటే, డిమాండుకు దాదాపు రెట్టింపు ఉత్పత్తి చేయగలవు. మరి అదంతా ఎటు పోతుంది? ప్రైవేటు థర్మల్ కేంద్రాలు, పీపీఏలు లేని ప్లాంట్లు కచ్చితంగా ఎక్స్ఛేంజీల ద్వారా విద్యుత్తు విక్రయించాల్సిందే. తెలంగాణ పీక్ డిమాండ్ 265 ఎంయూలకు చేరింది. ఇందులో 90 ఎంయూలను ఎక్స్ఛేంజీల నుంచి కొంటోంది. అంటే మార్కెట్లో విద్యుత్తు ఉన్నట్లే కదా? ఇలా కొన్న విద్యుత్తుకు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రోజుకు రూ.70-100 కోట్లు చెల్లిస్తున్నాయి. ఆ లెక్కన డబ్బులుంటే విద్యుత్తు దొరక్కపోవటం అనే సమస్య ఉత్పన్నం కాదు.
కొనడానికి డబ్బుల్లేక.... బిడ్ వేసినా దొరకలేదని సాకు:
బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభ్యత తగ్గి.. ధర పెరిగిందని అధికారులే చెబుతున్నారు. విద్యుత్తు ఎక్స్ఛేంజీ అంటేనే పోటీ మార్కెట్. ప్రతి గంటకూ బిడ్లు దాఖలు చేసి.. ఎక్కువ ధర కోట్ చేసిన వారికే విద్యుత్తు దక్కుతుంది. ఉదయం పీక్ (6-10 గంటలు), సాయంత్రం పీక్ (6-10 గంటలు) మధ్య డిమాండ్ ఎక్కువ. ఈ సమయంలో యూనిట్ ధర రూ.12-20 వరకు ఉంటోంది. కానీ, మన డిస్కంలు విద్యుత్తు కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతో పీక్ సమయంలోనూ యూనిట్ రూ.8-9 వంతున కోట్ చేస్తున్నాయని ఆ శాఖ వర్గాల సమాచారం. అందుకే ఆ సమయంలో విద్యుత్తు దొరకటం లేదు. దీంతో గ్రిడ్ భద్రత కోసం ఎడాపెడా కోతలు పెట్టాయి. పీక్ డిమాండ్ కాకుండా మిగిలిన టైం బ్లాక్‌లలో యూనిట్ రూ.5-6 మధ్య బిడ్లు వేసి డిస్కంలు కొంటున్నాయి.