తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో భారీగా పడిపోయిన విద్యుత్​ డిమాండ్ - తెలంగాణ విద్యుత్​ డిమాండ్

రాష్ట్రంలో భారీ వర్షాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో 3,100మెగావాట్లకి విద్యుత్ డిమాండ్ పడిపోయిందని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. కొన్ని సబ్ స్టేషన్లలో నీరు రావడంతో వాటిని బంద్ చేశామన్నారు. సీఎండీ ప్రభాకరరావు అర్ధరాత్రి విద్యుత్ సౌధలోని ఎస్​ఎల్​డీసీకి వెళ్లి అధికారులను అప్రమత్తం చేశారు.

telangana power demand
telangana power demand

By

Published : Oct 14, 2020, 5:11 AM IST

ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. సోమవారం రాత్రి 4,300 మెగా వాట్స్ డిమాండ్ ఉండగా.. మంగళవారం మధ్యాహ్నానికి 3,800 మెగా వాట్స్​కు పడిపోయింది. రాత్రి 10:30 గంటల సమయంలో 3,100మెగావాట్లకి విద్యుత్ డిమాండ్ పడిపోయిందని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగా విద్యుత్ డిమాండ్ 12వేల మెగావాట్లు ఉంటుంది. కానీ భారీ వర్షాలతో వినియోగం బాగా తగ్గింది. రాత్రి సమయంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్​ల వినియోగంతో పాటు పరిశ్రమలు, వ్యాపార సంస్థల విద్యుత్ వినియోగం భారీగా తగ్గుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది.

చెట్లు కూలడం వల్ల అంతరాయం

రాత్రంతా ఎడతెరిపిలేని వర్షాలు కొనసాగితే 3వేల మెగావాట్ల నుంచి 2,800ల మెగావాట్లకు విద్యుత్ తగ్గిపోయే అవకాశం ఉందని ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు అభిప్రాయపడ్డారు. అన్ని గ్రిడ్​లలో అధికారులను అప్రమత్తం చేశామని వివరించారు. డిమాండ్​లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత తగ్గినా దాన్ని ఎదుర్కొనే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. 24 గంటల పాటు సీఈ, ఎస్​ఈలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. ములుగు, భద్రాద్రి ప్రాంతంలో మినహా పెద్దగా విద్యుత్ అంతరాయం లేదన్నారు. అక్కడ వృక్షాలు కుప్పకూలడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు.

విద్యుత్​ సబ్​స్టేషన్లలోకి నీరు

గ్రేటర్ హైదరాబాద్​లో దాదాపు అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉందని ప్రభాకరరావు పేర్కొన్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వివిధ విద్యుత్ సబ్ స్టేషన్లలోకి వరద నీరు చేరిందని సీఎండీ తెలిపారు. నిమ్స్, కందికల్ గేట్, బంజారా కాలనీ, పెద్ద అంబర్ పెట్, కొత్త పేట్, ఆర్​ఆర్ కోర్టు, హనుమాన్ నగర్, హయత్ నగర్, తట్టి అన్నారం తదితర విద్యుత్ సబ్ స్టేషన్లలో వరద నీరు చేరడంతో వాటిని బంద్ చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని కాలనీలల్లో వరద నీరు చేరడం వల్ల విద్యుత్ సరఫరా నిలిపివేశామని తెలిపారు.

విద్యుత్​ స్తంభాలు ముట్టుకోవద్దు

లోతట్టు ప్రాంతాల పరిధిలోని విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండి, వరద నీరు చేరితే వెంటనే సరఫరా నిలిపివేయాలని రఘుమా రెడ్డి పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోవద్దని కోరారు. విద్యుత్​కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్​తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి :ఎల్బీనగర్​ పరిధిలో నిలిచిపోయిన విద్యుత్​ సరఫరా

ABOUT THE AUTHOR

...view details