తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్​ ఛార్జీల తగ్గింపుతో.. జలమండలికి ఊరట - electricity charges reduction for Hyderabad water board

జలమండలికి భారీ ఊరట లభించింది. విద్యుత్తు ఛార్జీల తగ్గింపుతో రూ.కోట్లు ఆదా కానున్నాయి. జలమండలికి కరెంటు ఛార్జీని గణనీయంగా తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

electricity charges reduction for Hyderabad Metropolitan Water Supply
విద్యుత్​ ఛార్జీల తగ్గింపుతో.. జలమండలికి ఊరట

By

Published : Jul 19, 2020, 7:55 AM IST

జలమండలికి కరెంటు ఛార్జీని గణనీయంగా తగ్గిస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సగటున యూనిట్‌కు రూ.6.15 చొప్పున ఈ సంస్థ చెల్లిస్తుండగా రూ.3.95కి తగ్గించింది. మెట్రో రైలు సంస్థకు ఇదే రేటుకు ఇస్తున్నందున తమకూ తగ్గించాలని వాటర్‌ వర్క్స్‌ చేసిన విన్నపాన్ని ఆమోదించినట్లు మండలి ఛైర్మన్‌ శ్రీరంగారావు జారీచేసిన ఉత్తర్వులో తెలిపారు.

నెలకు 11 కోట్ల యూనిట్ల కరెంటును వాటర్‌ వర్క్స్‌ వినియోగిస్తుండగా రూ.70 కోట్లకు పైగా బిల్లు వస్తోంది. దీనివల్ల సంస్థ నిర్వహణ వ్యయం బాగా పెరిగి అప్పులు అధికమవుతున్నాయని, ప్రజాసేవ చేస్తున్నందున కరెంటు ఛార్జీలు తగ్గించాలని జలమండలి విన్నవించింది. ఛార్జీల తగ్గింపుతో నెలకు రూ.20 కోట్ల వరకూ మండలికి ఆదా అవుతుంది. తగ్గిన ఛార్జీల మేరకు రాయితీ నిధులను ప్రభుత్వం భరించాలి. ఒకవేళ ప్రభుత్వం అంగీకరించకపోతే ఇతర వర్గాలకు ఛార్జీలు పెంచి దానిని క్రాస్‌సబ్సిడీ రూపంలో సర్దుబాటు చేసి విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టపోకుండా చూడాల్సి ఉంటుంది.

వ్యయం రూ.46.. వసూలు రూ.12

‘‘బెంగళూరులో తాగునీటి సంస్థకు సగటున రూ.5కే యూనిట్‌ కరెంట్‌ ఇస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమ కేటగిరీ కింద కనెక్షన్లు ఇవ్వడం వల్ల వివిధ ప్రాంతాల్లో వాటర్‌ పంపింగ్‌ స్టేషన్లకు రూ.5.10 నుంచి గరిష్ఠంగా రూ.6.65 దాకా ఛార్జీ వసూలుచేస్తున్నారు. కిలోలీటరు నీటి సరఫరాకు సగటున రూ.46 వరకూ వ్యయమవుతుండగా ప్రజల నుంచి నీటి రుసుం కింద కేవలం రూ.12 చొప్పున వసూలు చేస్తున్నాం. పలు మురికివాడలు, ఛారిటీ సంస్థలు, ప్రార్థనా మందిరాల వంటివాటికి ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజాసేవ చేస్తున్నాం’’ అని మండలి నివేదించింది.

రూ.1300 కోట్లు దాటిన బకాయిలు

ఇప్పటికే జలమండలి చెల్లించాల్సిన బకాయిలు రూ.1300 కోట్లు పైమాటే. బోర్డు చరిత్రలోనే ఇంత పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడం ఇదే తొలిసారి. తాజా నిర్ణయంతో ఏటా రూ.240-300 కోట్లు జలమండలికి ఆదా కానుంది. కృష్ణా మూడో దశ, గోదావరి తాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలు బోర్డు నడ్డి విరుస్తున్నాయి. వచ్చే ఆదాయమంతా విద్యుత్తు ఛార్జీల చెల్లింపునకే సరిపోతోంది. నెలకు రూ.100-110 కోట్ల వరకు ఆదాయం వస్తే.. అందులో రూ.75 కోట్లు కేవలం విద్యుత్తు బిల్లులకే పోతుంది. ఉద్యోగులు, సిబ్బంది జీతాలు ఇతర నిర్వహణ ఖర్చులు పోను.. నెలనెలా రూ.30 కోట్లపైనే లోటు మిగులుతోంది. దీంతో వేరే దారిలేక విద్యుత్తు బిల్లుల్లో సగమే చెల్లిస్తున్నారు. మిగతా మొత్తం బకాయి కింద పేరుకుంటోంది. దీనికితోడు బకాయిలపై 18 శాతం వరకు జరిమానా విధిస్తున్నారు.

2018-19 నుంచి అమలు చేస్తూ నిర్ణయం..

ఈ ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం గతంలో జలమండలి కోసం ప్రత్యేక టారిఫ్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 ఏప్రిల్‌ నుంచి దానిని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఆ దస్త్రానికి మోక్షం లభించడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2018-2019 సంవత్సరం నుంచి మారిన టారిఫ్‌ అమలు చేయనుండటంతో భారీగా జలమండలికి ఆదా కానుంది.

ABOUT THE AUTHOR

...view details