తెలంగాణ

telangana

ETV Bharat / city

క్యూఆర్‌ కోడ్‌తో కరెంటు బిల్లులు.. కొత్త విధానంపై కసరత్తు - కరెంటు బిల్లుల చెల్లింపులు

రాష్ట్రంలో విద్యుత్తు బిల్లుల చెల్లింపు మరింత సులభతరం కాబోతోంది. త్వరలో క్యూఆర్‌(క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌తో విద్యుత్తు బిల్లులు రాబోతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఇటీవలే దీనిపై ప్రాథమిక నిర్ణయం తీసుకొంది. అధికారులు కొద్దిరోజులుగా ఈ బిల్లుల జారీపై కసరత్తు చేస్తున్నారు.

క్యూఆర్‌ కోడ్‌తో కరెంటు బిల్లులు.. కొత్త విధానంపై కసరత్తు
క్యూఆర్‌ కోడ్‌తో కరెంటు బిల్లులు.. కొత్త విధానంపై కసరత్తు

By

Published : Feb 28, 2021, 9:03 AM IST

సాంకేతికత సిద్ధం కాగానే తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎస్‌ ఈఆర్‌సీ) అనుమతి పొందాక ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిస్తున్న విద్యుత్తు బిల్లులపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించి జారీ చేయడంతో పాటు వేర్వేరు పద్ధతులపై కసరత్తు జరుపుతున్నారు. తొలుత హైదరాబాద్‌లోని కొన్ని సెక్షన్లలో ఆరంభించి క్రమంగా అన్నిచోట్లా ప్రవేశపెట్టనున్నారు. క్యూఆర్‌ కోడ్‌ పరంగానూ సైబర్‌ మోసాలు జరుగుతున్నందున.. వినియోగదారులు సురక్షితంగా చెల్లింపులు చేసేలా భద్రతపై అధికారులు దృష్టిపెట్టారు.

సెకన్ల వ్యవధిలో బిల్లు చెల్లించవచ్చు..

చేతికి బిల్లు రాగానే ప్రస్తుతం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌, కార్డు, యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఈ విధానంలో వినియోగదారుల విశిష్ట సేవా సంఖ్య(యూఎస్‌ఎన్‌)తో పాటూ బ్యాంకు కార్డు, ఖాతా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌తో వీటి అవసరం లేకుండానే సెకన్ల వ్యవధిలో బిల్లు చెల్లించవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ను యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ)కు అనుసంధానించి బిల్లుపై ముద్రిస్తారు. యూపీఐ అనుసంధానిత బ్యాంకు యాప్‌తో వినియోగదారులు తమ మొబైల్‌లోని క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేసి సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే ఈ విధానం దుకాణాలు, సూపర్‌ మార్కెట్లలో విస్తృతంగా అమలవుతోంది. దేశంలోనే మొదటిసారిగా టాటా సంస్థ ముంబయిలో రెండేళ్ల క్రితమే క్యూఆర్‌ కోడ్‌తో బిల్లింగ్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాల్లోని డిస్కమ్‌లు ఇదే పంథాలో చెల్లింపులకు అనుమతిస్తున్నాయి.


డీడీలకు వీడ్కోలు..


మరికొన్ని సేవల్లో చెల్లింపులను డిస్కం సులభతరం చేసింది. విద్యుత్తు మీటర్‌ ఎక్కువ తిరుగుతుందనే అనుమానాలు ఉంటే వినియోగదారులు పరీక్షించుకోవచ్చు. ఇందుకోసం సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌ అయితే రూ.118, త్రీఫేజ్‌ అయితే రూ.345 బ్యాంకు డీడీ చెల్లించాల్సి ఉండేది. ఇపుడు వీటిని సైతం విద్యుత్తు వినియోగదారుల సేవా కేంద్రంలో ఆన్‌లైన్‌తో పాటు యాప్‌లోనూ చెల్లించే ఏర్పాటు చేశామని విద్యుత్తు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:భూ సమస్యలతో రైతులు సతమతం.. అందని సంక్షేమం

ABOUT THE AUTHOR

...view details