Electrical Buses in AP: దేశంలో చాలావరకు కాలం చెల్లిన బస్సులు కావడంతో... వాటి నుంచి వెలువడే పొగ కాలుష్యానికి కారణమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్దేశించింది. అన్ని రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో దిల్లీకి ఈ- బస్సులు కేటాయించగా, రెండో విడతలో ఏపీకి 350 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు చేసింది. వీటిలో విశాఖకు వంద, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, అలిపిరి డిపోలకు 50 చొప్పున బస్సులు కేటాయించారు.
టెండర్లు పూర్తి
బహుళజాతి పరిశ్రమల విభాగం కింద.. ఈ- బస్సులను కేటాయిస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించే 350 బస్సులపై.. డీహెచ్ఐ- కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం తిరుపతి ఇంటర్ సిటీ, తిరుమల ఘాట్ వరకు తిప్పే 100 బస్సులకు టెండర్లు పూర్తయ్యాయి. ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఏసీ బస్సులను.. అద్దె రూపంలో తిప్పేందుకు టెండర్లు దక్కించుకుంది.
" పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఈ-బస్సులు రాష్ట్రానికి మంజూరయ్యాయి. మొత్తం 350 బస్సుల్లో విశాఖకు వంద, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, అలిపిరి డిపోలకు 50 చొప్పున బస్సులు కేటాయించారు. కిలోమీటరుకు రూ.38.19పై. మేము చెల్లిస్తాము. ఇది మాకు, ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మధ్య ఒప్పందం. వచ్చే నవంబర్ వరకూ తిరుమల ఘాట్ వరకూ తిప్పే వంద బస్సులు సర్వీసులు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. తర్వాత ఫేజ్లో మిగిలిన నగరాల్లో ఈ- బస్సుల సేవలకు టెండర్ల కోసం సన్నాహాలు చేయనున్నాం" - మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్