తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. సాయం కోసం ఎదురుచూస్తోన్న కుటుంబం

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఆ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఏడాది క్రితం విద్యుత్ తీగ తగిలి తెగిపడి తీవ్రంగా గాయపడిన ఆ కుటుంబ యజమాని.. నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. మృతుని భార్య ఆరోగ్యం క్షీణించడం వల్ల వారి పిల్లల భవిష్యత్ దిక్కుతోచని స్థితికి చేరింది. పరిహారం అందించడంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహించడం వల్ల అగమ్యగోచరంగా మారిన ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.

Electrical accident victim's family is waiting for compensation
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

By

Published : Nov 9, 2020, 2:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మునిపంపుల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం పటాన్​చెరుకు వలస వచ్చాడు. అక్కడే ఓ పరిశ్రమలో పనిచేస్తున్న మంజుల అనే అమ్మాయిని వివాహమాడాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో కుకింగ్ మాస్టర్​గా చేరాడు. గతేడాది సెప్టెంబర్​లో పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇస్నాపూర్ కూడలిలో హైటెన్షన్ తీగ తెగి శ్రీనివాస్ మీద పడింది. తీవ్రంగా గాయపడిన అతని ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించి.. నాలుగు నెలల క్రితం మృతి చెందాడు.

పరిహారంలో జాప్యం

మృతుని కుటుంబానికి విద్యుత్ శాఖ చెల్లించాల్సిన పరిహారం కోసం పలుమార్లు విన్నవించినా.. అధికారులు స్పందించలేదు. తొలుత వికలాంగుల సర్టిఫికెట్ అడిగిన అధికారులు.. అది తీసుకెళ్లిన తర్వాత.. శవపరీక్షకు సంబంధించిన నివేదిక పత్రాలు ఇవ్వాలని అడిగారు. శవపరీక్ష ధ్రువపత్రం ఇచ్చినా ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని ఆ కుటుంబం వాపోతోంది.

దిక్కుతోచని స్థితిలో..

శ్రీనివాస్ మృతితో మానసికంగా కుంగిపోయిన మంజుల ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించింది. పిల్లలను పోషించడం భారమై.. విద్యుత్ శాఖ నుంచి అందాల్సిన పరిహారం కోసం అధికారులకు విన్నవించింది. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా.. స్పందించలేదని మంజుల ఆవేదన వ్యక్తం చేసింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. క్షీణిస్తున్న తన ఆరోగ్యానికి అయ్యే ఖర్చు ఆ కుటుంబానికి పెనుభారమవుతోంది.

సాయం చేయండి..

తండ్రి మృతి, క్షీణిస్తున్న తల్లి ఆరోగ్యంతో.. వారి పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ తల్లి ఆరోగ్యానికి చికిత్స చేయించడానికి డబ్బు లేక, ఏం చేయాలో పాలుపోక విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. త్వరగా స్పందించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details