తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2020, 5:06 PM IST

ETV Bharat / city

ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు...

కింద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భీమా నది.. పైన కరెంటు తీగకు వేలాడుతున్న వ్యక్తి. కిందపడితే భీమా నదిలో కొట్టుకుపోతాడు.. పైన కరెంటుతో ఆట.. ఆ దృశ్యం చూస్తే ఒళ్లు గగుర్లు పొడిచేలా ఉంది. ఆ వ్యక్తికి ఏమాత్రం భయం లేదు... ధ్యాసంతా పనిపైనే. 25 గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రాణాలు పణంగా పెట్టి.. విద్యుత్ తీగలకు మరమ్మతులు చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం హరిజనవాడలో చోటు చేసుకుంది.

electric-operator-did-adventure-for-repairing-the-electric-wires
ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు...

ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో నివర్ తుపాను కారణంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలోని కొటాల హరిజనవాడ వద్ద భీమా నది ఒడ్డున ఏర్పాటు చేసిన 33 కేవీ విద్యుత్తు స్తంభం వరద తాకిడికి నేల కూలింది. చుట్టుపక్కల ఉన్న సుమారు 25 గ్రామాల్లో అంధకారం అలుముకుంది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భీమా నది మధ్యలో విద్యుత్ తీగలు తెగిపోయాయి. అవి మరమ్మతు చేస్తే కానీ ఆ గ్రామాలకు విద్యుత్ అందించడం కుదరదు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎవ్వరిని అడిగినా భీమా నది నీటి ప్రవాహం తగ్గితేనే పని చేస్తామని అధికారులు చేతులెత్తేశారు. ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరికి ఏ రంగంపేట విద్యుత్ ఉపకేంద్రంలో ఉన్న లైన్ మెన్ మధు, ఆపరేటర్ నాగార్జునలకు పని అప్పగించారు. లైన్​మెన్ మధు సూచనలతో నాగార్జున ప్రాణాలకు తెగించి వేలాడుతున్న విద్యుత్తు తీగలకు మరమ్మతులు చేశాడు. నడుముకు తాడు కట్టుకుని విద్యుత్తు తీగలకు వేలాడుతూ అక్కడకెళ్లి తీగలకు మరమ్మతులు పూర్తి చేశారు. పని పూర్తయి విద్యుత్ సరఫరా పునఃప్రారంభమైంది. ప్రాణాలకు తెగించి మరీ మరమ్మతులు నిర్వహించిన ఆపరేటర్ నాగార్జున, లైన్​మెన్ మధును అధికారులు, ప్రజలు అభినందించారు.

ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు...

ABOUT THE AUTHOR

...view details