వివిధ కారణాలతో ఏపీలో ఎన్నికలు జరగని కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ (election notification) విడుదలైంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాల్టీలు, 498 పంచాయతీల్లోని 69 సర్పంచ్, 533 వార్డు పదవులు, 187 ఎంపీటీసీ స్థానాలు, 14 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 14న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 15న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. 17న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈనెల 16న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు, 18న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎస్ఈసీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 10 డివిజన్లు, 12 మున్సిపాల్టీల్లోని 13 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో నవంబర్ 15న ఎన్నికలు జరగనున్నాయి.
గ్రామ పంచాయతీలు
- ఈనెల 3న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ
- ఈనెల 5 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
- ఈనెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ
- ఈనెల 14న ఎన్నికలు, లెక్కింపు