వారం రోజులుగా ఇంటి చుట్టూ జలమే. తాగునీరు, నిత్యావసరాలు లేవు. చుట్టూ మురుగు కమ్మేయడంతో లోపల ఉండలేని పరిస్థితి. పండగ సమయంలో సొంతింటిని వదిలి బంధువుల వద్ద తల దాచుకోవాల్సి వస్తోంది.
- బండ్లగూడ చెరువు వరదతో ముంపునకు గురైన మల్లికార్జుననగర్ వాసి ఆవేదన ఇది.
తేరుకుంటుందా:
సరిగ్గా ఈనెల 13న భారీ వర్షాలతో వరదలో చిక్కుకున్న అనేక కాలనీలు ఇప్పటికీ తేరుకోలేదు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పరిధిలోని హస్మత్‌పేట చెరువుకు గండి పడటానికి తోడు ఆగకుండా కురుస్తున్న వానలకు 12 కాలనీలు మునిగాయి. పద్మావతి కాలనీ, రాయల్ ఎన్‌క్లేవ్, సౌజన్యకాలనీ, ఆరావళి ఎన్‌క్లేవ్, అమరావతి ఎన్‌క్లేవ్, ఇక్రిశాట్ ఫేజ్ 1, 2లలో తీవ్ర అవస్థలు నెలకొన్నాయి.
ఫాక్స్‌సాగర్ విరుచుకుపడి..
జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ వరదతో కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఉమామహేశ్వరకాలనీలో 642 ఇళ్లుమునిగి అంతా రోడ్డునపడ్డారు. వారం తర్వాత కూడా ముంపు వీడలేదు. నివాసితులంతా ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. మల్లాపూర్ డివిజన్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో 20కి పైగా ఇళ్లలో కింది అంతస్తులు నీటిలో మునిగే ఉన్నాయి.
హఫీజ్‌బాబానగర్‌లో హాహాకారాలు
తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు: హఫీజ్‌బాబానగర్, లలిత్‌బాగ్, ఉప్పుగూడ, గుల్షన్‌కాలనీ, కాంచన్‌బాగ్, బీబీనగర్
అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఒక్కసారిగా అలజడి. ఆదివారం అర్ధరాత్రి గుర్రంచెరువుకు గండిపడి పోటెత్తిన వరదతో హాఫిజ్‌బాబానగర్ అల్లకల్లోలంగా మారింది. నాలుగైదు గంటలు ఉద్ధృతి కొనసాగింది. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి నీరు క్రమంగా ఇళ్ల నుంచి బయటకు పోయింది. అప్పటికే నివాసాల్లో 2-3 అడుగుల బురద పేరుకుంది. గృహోపకరణాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు, నగదు కొట్టుకుపోయాయి.