సూక్తం అంటే మంచి మాట అని అర్థం. ఆ మాట మార్గ నిర్దేశం చేస్తుంది.సక్రమమైన దారిలో నడిచేలా చేస్తుంది. మన వేదాల్లో ఇలాంటి మంచి మాటలు చాలా కనిపిస్తాయి. వాటిని సూక్తాలు అంటారు. వాటిలో ఒకటైన క్రిమిసూక్తం అధర్వణ వేదంలో ఉంది. దీన్ని క్రిమి సంహార సూక్తం అని కూడా పిలుస్తారు. అధర్వణ వేదం రెండో భాగంలో అయిదో అనువాకంలో ముఫ్ఫై ఒకటో సూక్తంగా ఇది కనిపిస్తుంది. ఇందులో రోగాలకు కారణమయ్యే క్రిమికీటకాదులను గురించిన ప్రస్తావన, వాటిని నశింపజేసే మార్గాలు, మంత్రాలు ఉన్నాయి.
ఇన్ద్రస్త్య యూ మహీ దృషత్ క్రిమేః విశ్వస్య
తర్హణీ
తయా పినష్మీ సమ్ క్రిమీన్ దృషవా ఖల్వాన్ ఇవ!!
అనే శ్లోకంతో క్రిమి సంహార సూక్తం ప్రారంభమవుతుంది. ఇంద్ర సంబంధమైన పెద్ద శిల ఒకటి ఉంది. అది సమస్త క్రిములను నాశనం చేస్తుంది. నేను ఆ శిలలతో దేహంలోని క్రిములను శనగల్లా పిండి చేస్తాను. అని పై శ్లోకానికి అర్థం. ఓ క్రిమీ! భగవత్ శక్తితో నేను నిన్ను నాశనం చేస్తాను. అనే ధైర్యాన్ని తనకు తాను పొందే భావనతో ప్రారంభమవుతుంది.
దృష్టమ్! అదృష్టమ్! అతృంగమ్ అథోఇతి కురూ
అల్గణ్డూన్ సర్వాన్ శలునాన్ క్రిమీన్ వచసా జద్భుయా మసి!!
శరీరంలో కంటికి కనిపించే, కనిపించని క్రిములను నిర్మూలిస్తున్నాను. వలమాదిరి శరీరంలోపల అల్లుకు పోయిన క్రిములను నాశనం చేస్తూ ఉన్నాను. శరీరంలోపల ఉన్న రక్త మాంసాలను చెడగొడుతూ ఉన్న ‘అల్గండూ’, ‘శల్గ’ వంటి క్రిములన్నిటినీ ఈ మంత్రంతో నాశనం చేస్తున్నాను. ఇలా మంత్ర పఠనం చేయడం ద్వారా శరీరంలోపల ప్రభావం చూపించిన క్రిమి నశించి దాని ద్వారా సంక్రమించిన వ్యాధి తొలగిపోతుందని ధైర్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు.
అల్గుణ్డూన్ హన్మి మహతావధేన
దూనాః అదూనాః అరసాః అభూవన్!
శిష్టాన్ అశిష్టాన్ ని తిరామి వాబా
యథా క్రిమీణామ్ న కిః ఉత్‌శిషాతై!!
అల్గుండు క్రిములను ఉత్కృష్టమైన మంత్ర, ఔషధాది సాధనాలతో సంహరిస్తున్నాను. నా ఔషధాదులతో పరితప్తం అయినవి, కానివి... శుష్కములైనవి ఏవైతే ఉన్నాయో... శిష్టములైనవి, అశిష్టములైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మంత్రంతో నశింపజేస్తున్నాను. తీసుకునే ఔషధాల వల్ల, పఠించే మంత్రాల వల్ల అవన్నీ నాశనం అవుతాయి. అదే దృఢనమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ శ్లోకం వివరిస్తోంది.
అను ఆన్త్య్రమ్ శీర్షణ్వమ్ అథోఇతి పార్ష్షేయమ్ క్రిమీన్
అవస్కవమ్! వి అధర్వమ్ క్రిమీన్ వచసా జన్భుయామసి!!
క్రిములు క్రమంగా జీర్ణకోశానికి చేరేవి ఉన్నాయి. తలలో, శరీరంలోని పక్క భాగాల్లో ఇవి ఉంటాయి. అధో ముఖంగా సంచరించేవి... ఎలాగైనా శరీరంలో దారి చేసుకుని చేరేవి ఉన్నాయి. వాటిని, అవి కలిగించే దుర్లక్షణాలను మంత్ర బలంతో నాశనం చేస్తున్నాను.
యే క్రిమియః పర్వతేషు ననేషు
ఓషధీషు పశుషు అప్‌సు అన్తః
యే అస్మాకమ్ తన్వమ్ ఆవి విశుః
సర్వమ్ తత్ హన్మి జనిమ క్రిమీణామ్!
పర్వతాల్లో, అరణ్యాల్లో, పశువుల్లో ఉన్న క్రిములను, గాయాల వల్ల, అన్నపానాదుల వల్ల శరీరంలోకి చేరిన క్రిముల ఉత్పత్తినీ, క్రిముల జాతినీ నాశనం చేస్తున్నాను...
ఇలా చివరకు సర్వ క్రిములను నాశనం చేస్తూ ఉన్నాను... అందువల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రకృతి, పశుపక్ష్యాదులు అన్నీ సుఖంగా ఉండాలనే లోకాస్సమస్తాసుఖినోభవన్తు అనే ధ్యేయం క్రిమి సూక్తంలో కనిపిస్తుంది.
- ఐ.ఎల్.ఎన్.చంద్రశేఖర్
సర్వేసన్తు నిరామయాః
అందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలంటుంది
భారతీయ సంస్కృతి.
మనిషికి సవాళ్లు కొత్తకాదు...
మహమ్మారుల విలయతాండవాలూ కొత్తకాదు...
వాటిని ఎదుర్కోడానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ద్రష్టలైన రుషులు ఆయుర్వేదాన్ని కనిపెట్టారు. యోగాకు సానపెట్టారు.
ఒక సానుకూల విషయాన్ని పదేపదే జపించడం ద్వారా శక్తి జనిస్తుందని, అది రుగ్మతలను కూడా పోగొడుతుందని నమ్మారు. వాటినే మంత్రాలన్నారు, సూక్తాలన్నారు. ఔషధాలు తీసుకోవడంతో పాటు వాటిని పఠించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని వారు నమ్మారు. వాటిలో కొన్ని...
ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తి మేనాం
ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ దూరే కురు స్వాహా
హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా ....|
యోగ వాసిష్ఠంలోని ప్రసిద్ధ మంత్రమిది. వశిష్ఠుడి విరచితమైన ఈ గ్రంథంలో జీవాత్మ పరమాత్మతతో అనుసంధానమయ్యే క్రమమార్గాన్ని చర్చించారు. ఇందులో అంటువ్యాధులను గురించిన ఆసక్తికరమైన విషయాలు కూడా మనకు కనిపిస్తాయి. నిషిద్ధ, అపక్వ, అకాల, అతి భోజనాలు చేసేవారిని, కూడని ప్రదేశాలలో నివసించేవారిని, లోకానికి కష్టం కలిగించే పనులు చేసేవారినీ హింసించే ఒక భయంకర రాక్షసి ఉందని ఈ గ్రంథంలో ఉంది. ఆ రక్కసి వాయు పరమాణు రూపంలో కంటికి కనిపించకుండా వ్యాపిస్తుందని, ప్రాణుల ముక్కు రంధ్రాలలో నుంచి ప్రవేశించి, ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటుందని అందులో వివరించారు.
ఆ వ్యాధికి ఒక విరుగుడు ఉందని, మంచి ఆహారపు అలవాట్లున్న గుణవంతులను ఆ వ్యాధిబారిన పడకుండా రక్షించుకోవచ్చనీ, అప్పటికే ఆ వ్యాది ఫసోకిన వారిని రోగ విముక్తులను చేయడానికి పై మంత్రం ఉపయోగపడుతుందని ఈ గ్రంథంలో వివరించారు.
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్|
రుగ్వేదం ఏడో మండలంలో కనిపించే ఈ మంత్రం సమస్త వ్యాధుల నుంచి సంరక్షించి అకాలమృత్యువును తప్పించగల మహనీయ మంత్రంగా ప్రసిద్ధి చెందింది. రుద్రుడు లయకారకుడనీ అతడే ప్రాణికోటికి రక్షకుడైన మృత్యుంజయుడనీ మన సంప్రదాయం చెబుతోంది. మార్కండేయుడు ఈ మంత్రాన్ని జపించే చిరంజీవత్వాన్ని పొందాడని, అందుకే ఈ మంత్రం అపమృత్యుదోషాన్ని నివారిస్తుందని నమ్ముతారు. సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే ఓ పరమేశ్వరుడా, నిన్ను నేను పూజిస్తున్నాను.
తొడిమ నుంచి పండిన దోస పండు విడిపోయినంత సులువుగా నన్ను ఈ సంసార బంధనాల నుంచి విముక్తి చేయమని ఈ మంత్రార్థం. ఎలాంటి బంధనాలు, ఒత్తిళ్లు లేని శరీరం, మనసు అత్యుత్తమ స్థితిలో ఉంటాయి. పైగా ఈ మంత్రం జపించేటప్పుడు కలిగే ప్రకంపనలు రోగనాశనులని చెబుతారు.
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వంతరాయ చ అమృత కలశ హస్తస్య చ
సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ
త్రిలోక పతయే త్రిలోక నిత్యయే
ఓం మహావిష్ణు స్వరూపాయ
ఓం శ్రీ ధన్వంతర స్వరూపాయ
ఓం శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ నమః|
ఇది ధన్వంతరీ మంత్రం. అమృతం కోసం దేవతలూ రాక్షసులూ క్షీరసాగరాన్ని మథించే సమయంలో అందులో నుంచి ఆవిర్భవించి అమృతభాండం లోకానికి అందించిన మహావిష్ణు స్వరూపుడు ధన్వంతరి. మృతస్థితిని తొలగించేది అమృతం. కాబట్టి సుదర్శన స్వరూపుడైన ధన్వంతరిని అర్చించి స్వస్థత పొందవచ్చని రుషులు నమ్మి, దాన్ని మంత్ర రూపంలో వివరించారు.
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలోని మంత్రమిది. ఈ సప్తశతి అద్భుత శక్తికి ఆలవాలమని చెబుతారు. ముగురమ్మల మూలపుటమ్మను అర్చించి అన్ని రోగాలనూ నివారణ చేసుకోవచ్చని నమ్మేవారు.
రోగా నశేషాన్ అపహన్తి దుష్టాన్......
త్వా మాశ్రితానాం న విప న్నరాణాం
అనే మాటలు ఈ స్తోత్రంలో కనిపిస్తాయి. మొండి వ్యాధులను సైతం ఆ తల్లి నిర్మూలించగలదు. ఆమెను నమ్మినవారికి ఆపదలు రావనేది ఈ మాటల సారాంశం.
య న్మండలం వ్యాధి వినాశదక్షం
యదృగ్యజుస్సామసు సంప్రగీతమ్‌ః
ప్రకాశితం యేన చ భూ ర్భువః స్వః
పునాతు మాం తత్ సవితు ర్వరేణ్యం|
ఈ శ్లోకం సూర్యమండల స్తోత్రంలో ఉంది. ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అంటారు శరీర రక్షణ కోసం రోగాల రూపంలో ఉన్న భయంకర శత్రువులను, చీకట్లను నిర్మూలించటానికి సూర్యారాధన ఒక దివ్యౌషధం అని అనుభవజ్ఞుల మాట. సూర్య మండలోపాసన నిత్యమూ చేసే వారికి రోగపీడలు కలగవని నమ్మిన ప్రాచీన రుషులు ఆదిత్య హృదయానికి రూపకల్పన చేశారు.
ఆదిశంకరులు రచించిన సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం మంత్రమేనని ఆత్మజ్ఞుల అనుభవం. 20వ శ్లోకంలో శంకరులు విష బాధా నివృత్తి అమ్మ అనుగ్రహంతో కలుగుతుందని వివరించారు.
కిరంతీ మంగేభ్యం కిరణ నికురంబా మృతరసం
హృది త్వా మూధత్తే హిమకర శిలామూర్తిమివ యః
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారసిరయా!
అమ్మను ఆరాధించే సాధకుడికి విషసర్పబాధను, విషజ్వరబాధను నివారించేటంతటి శక్తి కలుగుతుందని ఈ శ్లోక సారాంశం. భయంకరమైన విష సర్పానికి దేవీభక్తుడి సాన్నిధ్యం గరుత్మంతుడి వంటిదని, ఆ భక్తుడు అలా చూచినంతనే విష జ్వర బాధితుడి నరనరాల్లో అమృత ప్రవాహం కలిగి ఉపశమనం లభిస్తుందని భరోసా..
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
ఇదీ చూడండి:ఫేస్బుక్ వల.. 12 లక్షలు స్వాహా