Schools Reopen in Telangana : ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల సర్కార్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. పదో తరగతి పరీక్షలు కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
తెరిచేందుకే మొగ్గు..
Telangana Schools Reopen : కరోనా మూడో ముప్పు, ఒమిక్రాన్ వ్యాప్తితో రాష్ట్రంలో కేసులు పెరగడం వల్ల ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడం వల్ల ఆ సెలవులను 30 వరకు పొడిగించారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్.. విద్యాసంస్థలు తెరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.