తెలంగాణ

telangana

ETV Bharat / city

Telugu academy scam: తెలుగు అకాడమీ డైరెక్టర్​పై వేటు... నలుగురు అరెస్ట్​

telugu Academy Director
telugu Academy Director

By

Published : Oct 1, 2021, 7:41 PM IST

Updated : Oct 1, 2021, 11:01 PM IST

19:40 October 01

తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు

Telugu academy scam: తెలుగు అకాడమీ డైరెక్టర్​పై వేటు... నలుగురు అరెస్ట్​

తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్‌మాల్​ (Telugu academy scam)కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. అకాడమీ డైరెక్టర్ అదనపు బాధ్యతల నుంచి సోమిరెడ్డిని విద్యాశాఖ తప్పించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.  

ఇప్పటికే ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న సీసీఎస్​ (CCS POLICE INVESTIGATION)పోలీసులు ఈ స్కాంలో మొత్తం నలుగురిని అరెస్ట్​ చేశారు. ఏపీ మర్కంటైల్‌ సహకార సంఘం మేనేజర్‌ పద్మావతి, యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్‌ సహకార సంఘం ఉద్యోగి మొయినుద్దీన్‌ను ఇదివరకే పోలీసులు అరెస్ట్​ చేయగా.. తాజాగా ఏపీ మర్కంటైల్‌ సహకార సంఘం ఛైర్మన్‌ సత్యనారాయణను సైతం అరెస్ట్​ చేశారు. ఈ నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అకాడమీకి చెందిన రూ.60 కోట్ల ఎఫ్‌డీలు దారి మళ్లించినట్లు గుర్తించారు. నకిలీ పత్రాలతో మర్కంటైల్‌ సహకార సంఘంలో ఖాతాలు సృష్టించి నిధులు (Telugu Academy Funds scam) మళ్లించినట్లు సీసీఎస్​ పోలీసులు గుర్తించారు. ఇందుకు సహకార సంఘం ఉద్యోగులు సహకరించినట్లు తేల్చారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

అసలు స్కాం ఏంటి..

 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu academy scam).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్‌ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.  

ఇలా వెలుగులోకి వచ్చింది..

ఈ నేపథ్యంలో .. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ (Fixed Deposits Scam In Telugu Academy)పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ (Three Members Committee)ని నియమించింది. ఇంటర్‌బోర్డు కార్యదర్శి, బోర్డులోని అకౌంట్స్‌ అధికారి, కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ఇందులో సభ్యులు. ఈ వ్యవహారంపై సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోపక్క నిధుల గోల్​మాల్ వ్యవహారంపై​ (Fixed Deposits Scam In Telugu Academy) సీసీఎస్​ లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే డైరక్టర్ సహా కొంత మంది సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. మరికొంతమంది సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారినుంచి వివరాలు సేకరించారు. బ్యాంకు, అకాడమీ సిబ్బంది కలిసి స్వాహా చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత కథనాలు..

Last Updated : Oct 1, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details