ఓ వైపు ప్రణాళిక లేని ప్రభుత్వాలు, మరోవైపు పంట దిగుబడులపై కన్నెర్ర చేసే ప్రకృతి.. ఫలితంగా వంట నూనెల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. దేశంలో నూనె గింజ పంటలు ఏటా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వేరుశనగ, సోయా, ఆవాలు తదితర పంటల దిగుబడులు చేతికొచ్చే సమయంలో వర్షాభావం, అకాలవర్షాల బారిన పడుతున్నాయి. పర్యవసానంగా ఏటా నూనె గింజల ఉత్పత్తి తగ్గి, వంట నూనెల డిమాండ్, సరఫరాలకు మధ్య పెద్ద అంతరం ఏర్పడుతోంది. ప్రకృతి సహకరించక నూనె గింజల పంటలు నష్టపోతున్న రైతులను, ఈసారి కరోనా వైరస్ అదనంగా దెబ్బతీసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ అన్నదాతలను మరిన్ని కష్టాలకు గురిచేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏటా 200 మిలియన్ టన్నుల వంటనూనెలు తింటున్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. భారతదేశంలో 23 మిలియన్ టన్నుల నూనె వినియోగిస్తున్నారు. దేశంలో పామోలిన్, పొద్దుతిరుగుడు, వేరుశనగ, వరి తవుడు తదితర నూనెగింజల నుంచి వస్తున్న నూనె ఉత్పత్తి కేవలం పదిన్నర మిలియన్ టన్నులు మాత్రమే ఉంటోంది. ఏటా దాదాపు 14 నుంచి 15 మిలియన్ టన్నుల మేర అన్ని రకాల వంటనూనెలను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా మలేసియా, ఇండోనేసియా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, లాక్డౌన్తో పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయినందువ వంట నూనెల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.