తెలంగాణ

telangana

ETV Bharat / city

నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు - శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు

ed summons Srinivas Reddy Mukundareddy Vinay Reddy and Devikarani in IMS scam
ed summons Srinivas Reddy Mukundareddy Vinay Reddy and Devikarani in IMS scam

By

Published : Apr 11, 2021, 7:15 PM IST

Updated : Apr 12, 2021, 5:31 AM IST

19:13 April 11

నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు

కార్మిక శాఖ పరిధిలోని బీమా వైద్య సేవల(ఐఎంఎస్‌) విభాగంలో చోటు చేసుకున్న కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం నగరంలోని ఏడు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.4 కోట్ల నగదు, నగలు స్వాధీనం చేసుకున్న ఈడీ వర్గాలు.. తాజాగా పలువురికి సమన్లు జారీ చేశాయి. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, డొల్ల ఫార్మా కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి, ఐఎంఎస్‌ మాజీ సంచాలకురాలు దేవికారాణి, ఓమ్ని మెడి సంస్థ నిర్వాహకుడు కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ పది రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. సోమవారం నుంచే ఒక్కొక్కరూ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కుంభకోణంలో కొల్లగొట్టిన నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై వీరిని విచారించనున్నారు.
ఆ అధికారిదే కీలక పాత్ర
నిందితుల గురించి స్పష్టత వచ్చినా డీల్‌ కుదర్చడంలో ఎవరు కీలకపాత్ర పోషించారనే దిశగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ అధికారే ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు.  దేవికారాణిని సంచాలకురాలిగా నియమించడం ఆయన వ్యూహంలో భాగమే. బాబ్జీ, ప్రమోద్‌రెడ్డిలాంటి వ్యాపారులతో డొల్ల కంపెనీలను సృష్టింపజేయడం లోనూ ఆయనదే కీలకపాత్ర. అప్పటి కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డితో డీల్‌ కుదర్చడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. తన నమ్మకస్తులనే డొల్ల కంపెనీల్లో బినామీలుగా ఉంచినట్లు ఈడీ అనుమానిస్తోంది. మరో కీలక ఉన్నతాధికారితోనూ మంత్రాంగం నడిపినట్లు భావిస్తోంది.
ఎవరికి ఎంత ముట్టిందో...
ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం రూ.200 కోట్ల వరకు దారి మళ్లినట్లు అంతకుముందే విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఈ సొమ్మంతా ఎక్కడికి తరలింది? ఎవరికి ఎంత వాటా ముట్టింది? ఆ సొమ్ముతో ఏ ఆస్తులు కొన్నారు? అనే విషయాలపై ఈడీ కూపీ లాగనుంది. ఇప్పటికే దేవికారాణితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పేర్లపై హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో స్థిరాస్తుల్ని ఏసీబీ గుర్తించింది. రిజిస్ట్రేషన్‌ ధరల ప్రకారమే వాటి విలువ రూ.15 కోట్లు ఉంటుందని బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లని అంచనా వేసింది. కుంభకోణంలో మరో కీలక నిందితుడు బాబ్జీ నుంచి రూ.150 కోట్ల విలువైన షేర్లను స్వాధీనం చేసుకుంది. అలాంటి చర, స్థిరాస్తుల్ని జప్తు చేసే దిశగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. తాజావిచారణలో నిందితులవాంగ్మూలం కీలకం కానుంది.
రూ.7.3 కోట్ల నగలపైనా దృష్టి
కుంభకోణంలో మళ్లించిన సొమ్ముతో దేవికారాణి దాదాపు రూ.7.3 కోట్ల నగలు కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. బంజారాహిల్స్‌లోని ఒక్క దుకాణం నుంచే పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించింది. కార్మిక శాఖకే చెందిన ఓ కీలక ఉన్నతాధికారి కుటుంబసభ్యుల కోసమే ఈ నగల్ని కొన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా వాటి ఆచూకీ ఇప్పటికీ బహిర్గతం కాలేదని తెలిసింది. తాజాగా ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది.

ఇదీ చూడండి:బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్

Last Updated : Apr 12, 2021, 5:31 AM IST

ABOUT THE AUTHOR

...view details