ఎక్కడ ఇయర్‌ఫోన్‌లను కొనుగోలు చేసినా.. లేదంటే ఫోన్‌తో పాటు వచ్చిన ఇయర్‌ఫోన్‌లకైనా అదనంగా మరో జత ‘రబ్బర్ ఇయర్ టిప్స్’ ఉంటాయి. వారానికో లేదంటే.. నిర్ణీత రోజులకు ఇయర్ టిప్స్‌ని మార్చడం మంచిది. వాడిన వాటిని ఏదైనా సబ్బు నీళ్లలో కడిగి ఆరబెట్టి మళ్లీ వాడొచ్చు.
ఎక్కువ సమయం వాడొద్దు..
రోజంతా ఖాళీనే. కాసేపు టిక్‌టాక్.. కొన్ని నిమిషాలు పాటలు.. తర్వాత యూట్యూబ్.. ఇలా రోజులో గంటల పాటు ఇయర్‌ఫోన్‌ని పెట్టుకుని వినడం మానుకోండి. కరోనా ఎక్కడ ఎలా మాటేసుకుని ఉందో చెప్పలేం. కరోనా కాటు గురించే కాదు. ఎక్కువ సమయం హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్‌లను వాడితే చెవుల్లో బ్యాక్టీరియా చేరి పలు సమస్యలు రావచ్చు.
స్పీకర్ ఆన్ చేయండి
ఎంత వర్క్ ఫ్రం హోమ్ అయినా ...రోజులో చాలా సార్లు ఫోన్‌ని వాడాల్సిన పరిస్థితి. ఎలాగూ ఉన్నది ఇంట్లోనే కదా. ఫోన్ కాల్స్ వస్తే ఫోన్‌ని చెవి దగ్గర పెట్టుకోకుండా.. లౌడ్ స్పీకర్‌లో పెట్టి మాట్లాడండి. దీంతో చాలావరకు ఫోన్‌ని ముఖానికి ఆనించాల్సిన అవసరం తగ్గుతుంది. ఫోన్‌ని కాస్త దూరంగా ఉంచినట్లవుతుంది.
ఇతరులకు ఇవ్వొద్దు
ఇయర్‌ఫోన్‌లను మీరు తప్ప మరొకరు వాడేందుకు అవకాశం ఇవ్వొద్దు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ‘నో’ చెప్పేందుకు వెనకాడొద్దు. హెడ్‌ఫోన్, ఇయర్‌ఫోన్.. ఏదైనా ఇంట్లోగానీ, ఆఫీస్‌లోగానీ ఒకరిది మరొకరు వాడొద్దు. ఒకవేళ వాడాల్సి వస్తే శుభ్రం చేశాకే చెవులకు పెట్టుకోండి. ఆధునిక సౌకర్యాలతో వైర్‌లు లేకుండా బ్లూటూత్ డివైజ్‌లు ఎక్కువ వాడేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మెడలో ధరించేస్తున్నారు. దీంతో వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువే. అందుకే అవసరం లేదనుకుంటే తీసి పాకెట్‌లో పెట్టేయండి.
ఇయర్‌బడ్ శుభ్రమేనా?
ఈ మిలీనియల్ జనరేషన్‌కి తెలిసింది ఒక్కటే కొనడం.. కొంతకాలం వాడడం.. విసిరేయడం. ‘యూజ్ అండ్ త్రో’నే. దీంతో వస్తువు ఏదైనా శుభ్రంగా వాడాలి అనే ధ్యాసే ఉండడం లేదు. నేడు విరివిగా వాడుతున్న ఇయర్‌ఫోన్‌లనే తీసుకోండి. వాటిని ఎప్పుడైనా శుభ్రం చేశారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కచ్చితంగా శుభ్రం చేయాలి. మార్కెట్‌కో.. ఆఫీస్‌కో వెళ్లొచ్చాక ఇయర్‌ఫోన్‌లను కూడా వెట్ వైప్స్‌తో శుభ్రం చేయాలి. అంతేకాదు.. వాటిని ఎక్కడబడితే అక్కడ వదిలేయకుండా వాటికంటూ ఓ పౌచ్‌ని వాడడం మంచిది.
స్ప్రే చేసి తుడవండి..
ఇప్పుడు వస్తున్న చాలావరకు ఇయర్‌ఫోన్‌లకు వాటర్‌ఫ్రూఫ్ రక్షణ సపోర్టు ఉంటోంది. అలాంటివి మీరూ వాడుతున్నట్లయితే గ్యాడ్జెట్‌లను శుభ్రం చేసే ద్రావణాన్ని వాటిపై స్ప్రే చేసి వెంటనే పొడి బట్టతో శుభ్రం చేస్తే మంచిది.
ఇవీ చూడండి:మామిడి పండ్లతో థాయ్ విందు...