Traffic Pending Challans :వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీ ఆఫర్ ప్రారంభమైనప్పటి నుంచి.. ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా పెద్దసంఖ్యలో వాహనదారులు రుసుములు చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్ను వినియోగించుకునేందుకు వాహనదారులు పోటీపడుతున్నారు. చలన్లా చెల్లింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావటంతో తొలి 8 గంటల్లోనే లక్షా 77వేల చలానాలను వాహనదారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ.కోటి 77లక్షల రూపాయలు జమయ్యాయి. నిమిషానికి 700 చలాన్ల చొప్పున వాహనదారులు చెల్లించారు. మొదటి రోజు మొత్తం 5 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. ఇందుకు సంబంధించి 5.5 కోట్ల రూపాయలు జమయ్యాయి.
దండెత్తటంతో సర్వర్ సమస్య..
ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా అధికసంఖ్యలో వెబ్‌సైట్‌ను తెరవడం వల్ల సర్వర్లపై భారం పడి సాంకేతిక సమస్య తలెత్తింది. ట్రాఫిక్ చలాన్లు చెల్లింపు జరిపే వెబ్‌సైట్ సామర్థ్యాన్ని పెంచినప్పటికీ... వాహనదారుల దాడికి సర్వర్లు తట్టుకోలేకపోయాయి. ఎక్కువమంది వాహనదారులు ఒక్కసారిగా వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుండడంతో వాటి పనితీరు కాస్త మందగించిందని ట్రాఫిక్ పోలీసు సంయుక్త కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే 80 శాతం పెండింగ్ చలాన్ల చెల్లింపు పూర్తయినట్టు ఆయన తెలిపారు.
సమయానుకూలంగా చెల్లించండి..
పేమెంట్ గేట్ వే వద్ద ఎక్కువగా సమస్య వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ నెల 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వెబ్సైట్లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. సమయానుకూలంగా జరిమానా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు.