TDP PROTEST: ఏపీలోని గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు దుర్గికి పార్టీ నాయకులు రాకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. పార్టీ శ్రేణుల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుర్గిలో 144సెక్షన్ విధించారు. మాచర్ల తెలుగుదేశం ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి... దుర్గికి రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఆయన బైక్‌పై దుర్గి బయలుదేరగా.. ఒప్పిచర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మారెడ్డిని గుంటూరుకు తరలించారు.
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళనకు బయలుదేరిన తెలుగుదేశం నేత మధుని మాచర్లలో పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఆయన పోలీసుల నుంచి తప్పించుకుని దుర్గి బయలుదేరారు. దీంతో ఆయనను కారంపూడిలో పోలీసులు అరెస్టు చేశారు. నేతల అరెస్టు సందర్భంగా ఆందోళనకు దిగిన తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేసి ఈపూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.