అనుభవాన్ని మించిన పాఠం లేదు. ఏపీలోని విజయవాడ నగరంలో యువ వ్యాపారవేత్తగా రాణిస్తున్న సాయిరమేష్ జీవితంలో అదే నిజమైంది . డిజిటల్ ఎడ్యుకేషన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దేశంలోని ప్రముఖ నగరాల్ని చుట్టివచ్చాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపుతూ... ప్రాంతీయ భాషలో ఆన్ లైన్ కోర్సులు రూపొందించాడు.
అలా రూపుదిద్దుకుంది..
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన సాయిరమేష్.. ఉపాధ్యాయుడిగా డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈవో, ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ సబెక్టులు బోధించేవాడు. హైదరాబాద్, విజయవాడల్లోని అనేక శిక్షణా కేంద్రాల్లో పనిచేశాడు. ఇదే సమయంలో ఆంగ్ల భాషలో ఉన్న సరికొత్త ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడటం గమనించాడు. సులువుగా అర్ధమయ్యేందుకు ప్రాంతీయ భాషలో ఆ కోర్సులు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మదిలో మెదిలింది. అలా కోర్సుదునియా డాట్ కామ్ ఆన్‌లైన్ వేదిక రూపుదిద్దుకుంది.
విస్తృత అధ్యయనం చేసి
విజయవాడ కేంద్రంగా కోర్సు దునియాను ఏర్పాటు చేసిన సాయిరమేష్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సుల సమాచారం విద్యార్థులకు అందిస్తున్నాడు. డిజిటల్ మార్కెటింగ్, ఆర్థికరంగ నిపుణులతో కలిసి ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులోకి తెస్తున్నాడు. ఇందుకోసం సాయిరమేష్.. విస్తృత అధ్యయనం చేశాడు. 2017లో దేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటించి...స్థానికంగా ఉన్న డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాల్ని పరిశీలించాడు. అనేక రాష్ట్రాల్లోని కళాశాలలు, విద్యా సంస్థలను సందర్శించి...విద్యార్థుల ఆలోచనల్ని, అభిప్రాయాల్ని తెలుసుకున్నాడు. ఎక్కువ శాతం మంది ప్రాంతీయ భాషలో కోర్సులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడంతో...ధైర్యంగా ముందుకు సాగాడు.అధ్యాపకుడిగా ఉన్న అనుభవంతో సాయిరమేష్..ఏ కోర్సులు చేస్తే విద్యార్థులకు ఉపయోగపడతాయో గుర్తించాడు. భవిష్యత్తుకు భరోసా ఇస్తూ.. ఆదాయం అందించే కోర్సుల్ని, వాటిని నేర్పించే శిక్షకుల్ని... కోర్సు దునియా డాట్ కామ్ ద్వారా యువతకు చేరువ చేస్తున్నాడు.