ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన రాచపల్లి శ్రీను పోలీసులనే నమ్మించి మోసం చేశాడు. శ్రీను ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. నేరాలు చేస్తూ అడ్డదారిలో నడిచేవాడు. 2006 నుంచి బంగారు ఆభరణాలు అపహరించేవాడు. ఇలా 18 దొంగతనాల కేసుల్లో చిక్కుకున్న శ్రీనుపై నాన్‌బెయిలెబుల్ వారెంట్లు ఉన్నాయి. 2017లో ఓ గొలుసు అపహరించి పారిపోయే క్రమంలో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటినుంచి దొంగతనాలు వదిలేసి... రూటు 'వైట్‌కాలర్' నేరాలపైకి మళ్లించాడు.
పోలీసులపై చర్యలు అనే వార్తలు ఆసక్తిగా గమనించేవాడు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారి జాబితా తయారు చేసుకున్నాడు. ఉన్నతాధికారినంటూ ఫోన్ చేసి హడావుడి చేసేవాడు. 'నాకింత ఇస్తే... నీకు పోస్టింగ్ వేయిస్తా' అని నమ్మించేవాడు. రోడ్లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారి బ్యాంకు ఖాతాల నంబర్లు చెప్పి... వారి ఖాతాలోనే డబ్బులు జమచేయమనేవాడు. అలా చేసిన ఓ అధికారికి అనుమానం రావటంతో...తీగ లాగారు. దీంతో అక్రమార్కుని ఆట కట్టింది. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి.
పత్రికల్లో చూసి...
పోలీస్ ఉద్యోగులు ఎందుకు వీఆర్‌లో ఉన్నారు. ఎందుకు సస్పెండ్ అయ్యారు.. క్రిమినల్ కేసులో ఎందుకు ఇరుక్కున్నారనే వివరాలను ఆరా తీసేవాడు. ఇలాంటి వార్తలు పత్రికల్లో ప్రచురితమైతే ఆసక్తిగా పరిశీలించేవాడు. సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఫోన్‌చేసి రేంజ్ డీఐజీని మాట్లాడుతున్నానని... అధికారుల వివరాలను అడిగి తెలుసుకునేవాడు. కిందిస్థాయి సిబ్బంది ఇతడిని నమ్మి వివరాలు చెప్పేవారు. ఫోన్ చేసి వివరాలు అడిగే సమయంలో... అవతలివారు గట్టిగా అడిగితే వెంటనే ఫోన్‌కట్ చేసేవాడు. నేరాలకు పాల్పడిన తరువాత సిమ్ కార్డు మార్చేస్తాడు.
- తెలంగాణలోనూ బాధితులు...