బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని శాఖలకు ప్రభుత్వం ఆదేశం కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనల తయారీకి ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిపాదనలు సమర్పించాలని అన్ని శాఖలకు స్పష్టం చేసింది.
బడ్జెట్ అంచనాలు - ప్రతిపాదనలు
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల కోసం ప్రతిపాదనలు అందించాలని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి లక్షా 82 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్లో ఆ మొత్తాన్ని భారీగా తగ్గించింది. లక్షా 46వేల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించి అందులో వాస్తవ బడ్జెట్ రూ.లక్షా 36వేల కోట్లు మాత్రమేనని తెలిపింది.
కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడ..?
ఆర్థికమాంద్యం కారణంగా ఆదాయాలు భారీగా పడిపోయాయని... కేంద్రం నుంచి కూడా రాష్ట్ర వాటా, నిధులు సరిగా రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే వ్యాఖ్యానిస్తోంది. ఇదే సమయంలో తీవ్ర ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదాయాలు తగ్గినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలైన రూ.లక్షా 36 వేల కోట్ల మార్కును చేరుకుంటామని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.
కొత్త బడ్జెట్ -సర్కార్ ప్రణాళిక
- ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన బడ్జెట్ అంచనాల్లో వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగరాదని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
- సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగానే కొత్త బడ్జెట్ కోసం అంచనాలు ప్రతిపాదించాలని తెలిపింది.
- 2019 డిసెంబర్ 31 నాటికి మిగిలిపోయిన చెల్లింపుల వివరాలను, ఇంజినీరింగ్ విభాగాలు చేసుకున్న ఒప్పందాల వివరాలను సమర్పించాలని పేర్కొంది.
- చాలా శాఖలు ప్రతి ఏడాది ఊహాజనితంగా ప్రతిపాదనలు సమర్పిస్తున్నాయన్న ఆర్థికశాఖ.. ఈసారి అలా కాకుండా కచ్చితమైన అవసరాలకు అనుగుణంగానే ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది.
- చాలా శాఖలు, విభాగాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో పెద్దమొత్తంలో నగదు పేరుకుపోతున్నట్లు తేలిందని.. బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా కొన్ని శాఖలు మాత్రమే ఇస్తున్నాయని పేర్కొంది.
"నిధుల వినియోగంలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ఉంది. అన్ని శాఖలు, విభాగాలు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలను విధిగా ఇవ్వాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం" - తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ
ఏడో తేదీలోగా ప్రతిపాదనలు
బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థికశాఖ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది. ఆయా శాఖల కార్యదర్శులకు వచ్చే నెల ఏడో తేదీలోగా ప్రతిపాదనలు సమర్పించాలని గడువు విధించింది. అన్ని శాఖల కార్యదర్శుల నుంచి తొమ్మిదో తేదీ వరకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందాలని తెలిపింది. ప్రతిపాదనలు అందాక.. శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి ఆర్థికశాఖ బడ్జెట్ కసరత్తు వేగవంతం చేయనుంది.
ఇవీ చూడండి:అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!