దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా కొన్ని పండుగలు వచ్చాయంటే తెలుగు వారు ఎక్కడున్నా స్వగ్రామాలకు చేరుకుంటుంటారు. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో ఇప్పటికే స్వగ్రామాలకు వెళుతున్న ప్రయాణికులతో రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సీట్లు దొరకక నిలబడి.. నానా ఇబ్బందులు పడుతూ ఇళ్లకు చేరుతున్నారు. ఇదిలా ఉండగా.. విమాన సర్వీసుల్లో స్వగ్రామాలకు వస్తున్న తెలుగు వారు రెండు రోజులుగా ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన కొల్హాపూర్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
శనివారం కొందరు తెలుగు వారు కొల్హాపూర్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రావడానికి అలయన్స్ ఎయిర్ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. నిన్న ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులు.. సమయానికి విమానం రాకపోవడంతో నిన్నటి నుంచి అక్కడే నిరీక్షిస్తున్నారు. శనివారం రాత్రి కొల్హాపూర్ విమానాశ్రయంలోనే బస చేశారు. పలువురు ప్రయాణికులు అధికారులను ప్రశ్నించగా.. రోజులో 3 నుంచి 4 సార్లు విమానం వస్తుందని చెప్పారు. అయినా సాయంత్రం వరకు విమానం రాలేదు. దాంతో కొందరు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సమయం ఇచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల వరకూ విమానం రాకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు విమాన సర్వీసు రద్దు చేయడంతో విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో గొడవకు దిగారు. నిరీక్షిస్తున్న వారిలో ఇద్దరు గర్భిణీలు, చంటిపిల్లలు ఉన్నారు. వారికి ఉదయం నుంచి తినడానికి తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.