రాష్ట్రం సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. వరద ఉద్ధృతిని అంచనా వేస్తూ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద..
గోదావరి ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 24,150 క్యూసెక్కులు వస్తోంది. 8 గేట్లు ఎత్తి 24,960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 7,500 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టంతో శ్రీరాం సాగర్ జలాశయం కళకళలాడుతోంది.
కరీంనగర్ జిల్లాలో దిగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. మోయతుమ్మెద వాగు నుంచి 60 వేల క్యూసెక్కుల ప్రవాహం రిజర్వాయర్లోకి చేరుతోంది. దిగువ మానేరు ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి 9,953 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం 4 గేట్ల ద్వారా 25,278 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 697.10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. కడెం జలాశయం పూర్తి నీటి నిల్వ 7.60 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.86 టీఎంసీలగా ఉంది. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,852 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి... 6,640 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.7 అడుగులు కాగా.. ప్రస్తుతం 358.65 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది.