కరోనా మహమ్మారి పంజా విసురుతున్న విపత్కర వేళ కొందరు కన్న బిడ్డలే వృద్ధులైన తమ తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచాలని చూస్తున్నారు. వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వృద్ధులకు ఆశ్రయం కల్పించాలంటే.. కరోనా భయంతో పలు ఆశ్రమాలు వెనుకంజ వేస్తున్నాయి. ఇప్పటికే ఆశ్రమాల్లో ఉన్నవారి ఆరోగ్యానికి కొత్తవారి వల్ల ముప్పు ఏర్పడుతుందన్న భయం, దాతలు తగ్గటం, ఆర్థిక ఇబ్బందుల వల్ల వారికి ప్రవేశం కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాయి.
కరోనా కాలం
కరోనా ప్రభావం మొదలైన తర్వాత తమ వాళ్లను చేరుస్తామని వృద్ధాశ్రమ నిర్వాహకులను సంప్రదించే వారి సంఖ్య బాగా పెరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీకృష్ణ వృద్ధాశ్రమంలో చేర్చేందుకు గతంలో నెలకు దాదాపు 20 మంది వరకూ సంప్రదించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30-40కి పెరిగిందని నిర్వాహకుడు రాజశేఖరం చెప్పారు.
తిరుపతిలోని అభయక్షేత్రం ఆశ్రమంలోనూ ఇదే పరిస్థితి. ‘‘మా వద్ద కొత్తగా వృద్ధుల్ని చేరుస్తామని గతంలో నెలకు ఇద్దరు, ముగ్గురు సంప్రదించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య పదికి పెరిగింది. ఎలాగైనా సరే తమ వారిని తప్పనిసరిగా చేర్చుకోవాలని అడుగుతున్నారు’’ అని ఆశ్రమ నిర్వాహకురాలు తస్లీమా అంటున్నారు. ‘‘వృద్ధులను ఆశ్రమంలో చేర్చుకోవాలని రోజూ నలుగురైదుగురు కోరుతున్నారు. గతంలో అప్పుడప్పుడూ ఒకరో ఇద్దరో అడిగేవారు’’ అని కర్నూలు జిల్లా బనగానపల్లెలోని శాంతి వృద్ధాశ్రమ నిర్వాహకుడు సుబ్రమణ్యం చెప్పారు.
కరోనా భయంతో వెనుకంజ
కొత్తగా ఎవరినైనా చేర్చుకోవటానికి నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. కరోనా భయం వారిని వెంటాడుతోంది. కొత్తవారి నేపథ్యం తెలియదు. చేరిన తర్వాత వారికి కరోనా లక్షణాలు వస్తే.. ఆ ప్రభావం మిగతావారిపై పడుతుందనే ఆందోళనతో ప్రవేశాలకు నిరాకరిస్తున్నారు. మరీ దయనీయ పరిస్థితుల్లో ఉన్నవారిని మాత్రం.. కొవిడ్ పరీక్షలు చేయించిన తర్వాత నెగెటివ్‌గా నిర్ధారణైతే చేర్చుకుంటున్నారు.
వారిని కొన్నిరోజుల పాటు విడిగా ఉంచుతున్నారు. ‘‘మరీ దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఆరుగురికే గత నాలుగు నెలల్లో ఆశ్రయమిచ్చాం. పరీక్షలు చేయించిన తర్వాత చేర్చుకున్నాం’’ అని చిత్తూరులోని అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు పద్మనాభనాయుడు చెప్పారు.
‘‘ప్రస్తుతం మా ఆశ్రమంలో పెద్దవయసు వారంతా ఉన్నారు. వారి ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మా ప్రధాన బాధ్యత. కొత్తవారిని చేర్చుకుంటే ఇప్పుడు ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని.. ఎవరికీ ఆశ్రయం కల్పించలేకపోతున్నాం’’ అని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని విశ్వ మానవ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్ వివరించారు.
ప్రధాన కారణాలివే
- కరోనా ప్రభావంతో చాలామందికి ఉపాధి పోయి.. ఆదాయాలు తగ్గిపోయాయి. వారి జీవనమే కష్టమైపోతున్న పరిస్థితుల్లో కొంతమంది వృద్ధుల భారం మోయలేకపోతున్నారు.
- ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కష్టమని.. కొందరు ముందే దూరంగా ఉంటే మేలని చూస్తున్నారు.
- తాము నివసించే చోట కరోనా అధికంగా ఉందని.. వృద్ధులు దాని బారిన త్వరగా పడే ప్రమాదం ఉన్నందున సురక్షితంగా ఉంచేందుకు ఆశ్రమంలో చేరుస్తున్నామనీ కొందరు చెబుతున్నారు.
ఇవీ చూడండి:రికవరీలో రికార్డు- ఒక్కరోజే 36 వేల మంది డిశ్చార్జ్