తెలంగాణ

telangana

ETV Bharat / city

బంగారం ఎవరిది.. స్మగ్లర్లు ఎవరు? - సికింద్రాబాద్​ బంగారం కేసు

సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలో స్వాధీనం చేసుకున్న రెండు కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు, రూ. 2 కోట్ల నగదుపై డీఆర్​ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురి నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణులను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ముగ్గురు నిందితులు నగరానికి చెందిన వారు కావడం వల్ల స్వాధీనం చేసుకున్న బంగారం ఏయే దుకాణాలకు చేరవేసేందుకు తీసుకొచ్చారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

బంగారం ఎవరిది.. స్మగ్లర్లు ఎవరు?

By

Published : Nov 25, 2019, 6:20 AM IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో గల్ఫ్‌కు వెళ్తున్న వారిపై నిఘా పెరగడం వల్ల అక్రమార్కులు రూట్​ మార్చినట్లు డీఆర్​ఐ అధికారులు గుర్తించారు. ఈనెల 21న సికింద్రాబాద్​ వెస్ట్​ మారేడ్​పల్లిలో ఓ ఆస్పత్రి వద్ద రూ. 2 కోట్లు విలువైన బంగారం బిస్కెట్లు, మరో రెండు కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ఎవరిది.. స్మగ్లర్లు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం నిందితుల చరవాణులను విశ్లేషిస్తున్నారు.

ఎలా పట్టుబడ్డారు..

అక్రమార్కుల కదలికలపై డీఆర్​ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. వాహనాలు పార్కింగ్​ చేసిన స్థలం, కార్ల రంగు, నంబర్లు సహా నగదు, బంగారం ఎక్కడ దాచారో వంటి సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు సైతం పక్కా ప్రణాళికలు రచించారు. కారులోని హ్యాండ్​ బ్రేక్​ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలో బంగారం దాచారు. అక్రమ సొమ్ము తరలించే సమయంలో ఎక్కడైనా తనిఖీలు జరగవచ్చనే అనుమానంతో ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ముందుస్తు సమాచారంతో అధికారులు బంగారం, నగదు స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్​ చేశారు.

దర్యాప్తు ఎలా సాగుతోంది..

స్వాధీనం చేసుకున్న నగదును పలు బ్యాంకుల నుంచి విత్​డ్రా చేసినట్లుగా డీఆర్​ఐ అధికారులు గుర్తించారు. అంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎవరు డ్రా చేశారో తెలుసుకుంటున్నారు. ఆయా ఖాతాదారుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తే ఎవరు బంగారం కొనుగోలు చేశారో తెలిసే అవకాశం ఉంటుందని.. వారి ద్వారా స్మగ్లర్ల వివరాలు తెలుసుకోవాలని డీఆర్​ఐ అధికారులు భావిస్తున్నారు. అరెస్ట్​ చేసిన వారు ముగ్గురు హైదరాబాద్​కు చెందిన వారే కావడం వల్ల వారి నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణిల డేటాను విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్​కు చెందిన స్మగ్లర్లు ఎవరనే కోణంలోనే..

స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లపై దుబాయి అనే పేరు ముద్రించి ఉంది. గల్ఫ్​ దేశాల నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముంబయి ఎయిర్​పోర్టు నుంచి మైసూరు మీదుగా హైదరాబాద్​ తీసుకొచ్చినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం. నిందితులు నుంచి కొంత సమాచారాన్ని రాబట్టినా.. పూర్తిస్థాయిలో విచారించి హైదరాబాద్​కు చెందిన స్మగ్లర్లను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని డీఆర్​ఐ అధికారులు చెబుతున్నారు.

బంగారం ఎవరిది.. స్మగ్లర్లు ఎవరు?

ఇవీచూడండి: పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం, నగదు

ABOUT THE AUTHOR

...view details