అది 2019, మార్చి. జెనీవాలో ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఓ సమావేశం. ప్రపంచ దేశాల ప్రముఖులెందరో ఆశీనులయ్యారు. వేదికపై ఓ యువతి డౌన్ సిండ్రోమ్ గురించి ప్రసంగిస్తోంది. చివర్లో కరతాళ ధ్వనులు మార్మోగాయి. ఆమె కూడా డౌన్‌సిండ్రోమ్ బాధితురాలే కావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ యువతే 30 ఏళ్ల కరిష్మా కన్నన్.
కరిష్మాకు డౌన్‌సిండ్రోమ్ ఉందని ఆమెకు నాలుగు నెలల వయసులో తెలిసినప్పుడు తల్లిదండ్రులు కల్పన, కన్నన్‌లు తీవ్ర వేదనకు గురయ్యారు. అదో జన్యువ్యాధి. శారీరక, మానసిక మాంద్యంతోపాటు గ్రహణశక్తి తక్కువగా ఉంటుంది. చికిత్స కోసం కరిష్మాను ప్రముఖ వైద్యులెందరికో చూపించారు. తనకు మూడేళ్లు నిండే సరికి చెల్లి కాజోల్ పుట్టింది. దాంతో ఆమె జీవితంలో మార్పు మొదలైంది. చెల్లితో కలిసి ఆడుకోవడంలో కరిష్మాలో సంతోషం కనిపించేది. చాలా రకాల థెరపీలు, కౌన్సెలింగ్ జరగడంతో మెల్లగా మిగతా పిల్లలతో కలిసేది. అయిదేళ్ల వయసులో తనను చెన్నైలోని స్పెషల్ స్కూల్‌లో చేర్చారు. చదువుతోపాటు భరతనాట్యం, చిత్రలేఖనం వంటి కళల్లోనూ చురుకుగా ఉండేది. తర్వాత వీరి కుటుంబం వియత్నాంకు తరలివెళ్లింది. అప్పుడు ఆమెకు 17 ఏళ్లు. అక్కడో టీచర్ వద్ద చిత్రకళలో ప్రావీణ్యాన్ని పెంచుకుంది. నాట్య ప్రదర్శనలివ్వడంతోపాటు, చిత్రలేఖనాల ప్రదర్శననూ ప్రారంభించింది. కాన్వాస్‌పై పట్టు సాధించి, ప్రకృతినే తన వర్ణాల్లో అద్భుతంగా ప్రతిఫలింపచేయడం మొదలుపెట్టింది. వీటితోపాటు ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన కరిష్మాకు చిన్నప్పటి నుంచే ఉంది. దానికి తన కళలను ఆలంబనగా చేసుకుంది. తను గీసిన 40 పెయింటింగ్స్‌తో వియత్నాంలో తొలి ప్రదర్శనను ఏర్పాటు చేసింది. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును తనలాంటి మరో చిన్నారి శస్త్రచికిత్సకు అందించింది. రెండేళ్లక్రితం తిరిగి ముంబయికి చేరుకుంది కరిష్మా కుటుంబం.
తనలాంటి వారికి అండగా!
అమ్మా నాన్నల ప్రోత్సాహంతో ‘స్టూడియో 21అప్’ను ప్రారంభించాం. దీనిద్వారా డౌన్‌సిండ్రోమ్ బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నా. వంటావార్పూ, ఈత కొట్టడం, యోగా నేర్పడం, నృత్యం, షాపింగ్ వంటి వాటిలో శిక్షణ ఉంటుంది. చిత్రకళపై ఆసక్తిని పెంచడానికి వర్క్‌షాపు నిర్వహిస్తున్నా. ఆస్మాన్ ఫౌండేషన్ మానసిక దివ్యాంగులకోసం నిర్వహించిన అందాల పోటీల్లో ర్యాంప్‌వాక్ చేశా. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, సౌత్‌ఈస్ట్ ఆసియా వంటి పలు దేశాల్లో డౌన్‌సిండ్రోమ్ వ్యాధిపై అవగాహన ప్రసంగాలు చేశా. ఇప్పటి వరకు ‘ఐ కెన్, యు కెన్, వుయి కెన్’ పేరుతో సోలో పెయింటింగ్స్ ప్రదర్శనలను నిర్వహించా. వాటి ద్వారా వచ్చిన రూ.60 లక్షలపైచిలుకు సొమ్మును విరాళాలుగా అందించా. ఈ నగదును నిరుపేద చిన్నారుల హృద్రోగ చికిత్సలకు, విద్యనందించడానికి వినియోగిస్తున్నారు. నా కృషికి వియత్నాంలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారుల నుంచి అందిన ప్రశంసలు మరవలేను. మరెన్నో విశిష్ట పురస్కారాలూ లభించాయి.