తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2022, 11:24 AM IST

ETV Bharat / city

MMTS: ఇక ఎంఎంటీఎస్ ఆగేదేలే.. డబుల్​లైన్‌తో తొలగిన ఆటంకాలు..

MMTS: ఒకటే లైను వందలాది రైళ్లు ఊహించండి ఎంత ఒత్తిడి ఉంటుందో.. ఇప్పుడు రెండు లైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంఎంటీఎస్‌ పరుగుకు ఆటంకాలు తొలగాయి. విద్యుదీకరణ కూడా పూర్తవ్వడంతో రైళ్ల వేగానికి అవకాశం లభించింది. ఇదంతా కాచిగూడ - మహబూబ్‌నగర్‌.. ఆ పైన బెంగళూరు మార్గంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన డబుల్‌ లైన్‌కు సంబంధించిన వెసులుబాటు. ఫిబ్రవరి నెలాఖరుకు పనులు పూర్తవగా.. ఇటీవలే పరీక్షలు కూడా నిర్వహించి రైళ్ల రాకపోకలకు ద.మ. రైల్వే పచ్చ జెండా ఊపింది.

Double lines available for hyderabad mmts
Double lines available for hyderabad mmts

MMTS: 'కాచిగూడ వరకూ ఒక లెక్క.. తర్వాత ఒక లెక్క'లా నడిచిన ఎంఎంటీఎస్‌ రైళ్లకు ఇక ఆటంకాలు తొలిగాయి. కర్నూలు, మహబూబ్‌నగర్‌ మీదుగా వచ్చే పాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌మీద రావడం.. ఫలక్‌నుమా నుంచి రెండు లైన్లు వినియోగించుకోవడంతో ఎప్పుడు ఏ రైలు ఎంఎంటీఎస్‌ రైళ్లకు అడ్డుగా మారుతుందో తెలియని పరిస్థితి. అందుకే కాచిగూడ వరకూ సమయానికి వెళ్లినా.. తర్వాత నిరీక్షణ తప్పేది కాదు. మూడేళ్ల క్రితం కాచిగూడ రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత కర్నూలు ఎక్స్‌ప్రెస్‌ - ఎంఎంటీఎస్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చి ప్రమాదానికి గురయ్యాయి. ఇప్పుడు రెండు లైన్లు అందుబాటులోకి రావడంతో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.

ట్రాక్‌ సామర్థ్య పరీక్షలు పూర్తి..

గతంలో ఫలక్‌నుమా వరకే డబుల్‌ లైను వెసులుబాటు ఉండేది. ఇప్పుడు మహబూబ్‌నగర్‌ వరకూ డబుల్‌ లైన్లు ఏర్పడడంతో ఉందానగర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ సేవలు పొడిగించడానికి వీలు కలిగింది. అందుకే త్వరలో ఉందానగర్‌ వరకూ నడపాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ట్రాక్‌ సామర్థ్య పరీక్షలు పూర్తి చేసుకుని.. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా నడిపారు. ఇక పూర్తిస్థాయిలో నడపడానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

బెంగళూరుకు సులభంగా..

గరంలోని వేలాదిమంది ఐటీ ఉద్యోగులు బెంగళూరులో పని చేస్తున్నారు. వారాంతాల్లో నగరానికి రావడం.. తిరిగి వెళ్లడం ఎంతో ప్రయాసతో కూడుకున్నదిగా మారింది. రైళ్లకోసం గంటలతరబడి వేచి ఉండాల్సిన పని లేకుండా.. రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్‌ - డోన్‌ సెక్షన్ల మధ్య ట్రాపిక్‌ రద్దీ నివారణకు డబుల్‌లైన్‌ పని చేస్తుందని హైదరాబాద్‌ డీఆర్‌ఎం చెప్పారు. బెంగళూరుకు రైళ్ల వేగంతో పాటు.. సంఖ్యను పెంచడానికి వీలు కలిగిందన్నారు.


ఇదీ చూడండి:రెండేళ్ల తర్వాత.. యథావిధిగా అంతర్జాతీయ విమాన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details