తెలంగాణ

telangana

ETV Bharat / city

Double Bedroom houses: "పట్టణాల్లో వడివడిగా.. పల్లెల్లో నెమ్మదిగా" - telangana double bedroom house scheme

తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో 57 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. నిర్మాణ పనులు, నిధుల విడుదలలో గ్రేటర్ హైదరాబాద్ ముందుండగా.. ఆ తర్వాత పట్టణ ప్రాంతాలున్నాయి. పల్లెల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

Double bedroom house, double bedroom scheme, two bedroom house scheme
డబుల్ బెడ్ రూం ఇళ్లు, డబుల్ బెడ్ రూం పథకం, రెండు పడక గదుల ఇళ్ల పథకం

By

Published : Jun 30, 2021, 7:00 AM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో 57 శాతం లక్ష్యాన్ని పూర్తిచేసింది. జూన్‌15 నాటికి గృహనిర్మాణశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.67 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో దాదాపు 50 శాతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన చోట కొద్దిరోజులుగా పంపిణీ మొదలుకాగా, రానున్నరోజుల్లో పెద్దసంఖ్యలో లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు 1,20,637, పట్టణ ప్రాంతాలకు 70,420, జీహెచ్‌ఎంసీకి లక్ష ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.10,192.61 కోట్ల ఖర్చయింది. నిర్మాణ పనులు, నిధుల విడుదలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ముందుండగా..ఆ తర్వాత పట్టణ ప్రాంతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.

  • గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ అంచనా వ్యయం రూ.6,716.44 కోట్లు కాగా, రూ.2,087.92 కోట్ల (31.08 శాతం) పనులే జరిగాయి.
  • పట్టణ ప్రాంతాల్లో రూ.4,248.10 కోట్లకు గాను రూ.1,697.98కోట్ల పనులు(39.96శాతం) పూర్తయ్యాయి.
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో అంచనా వ్యయం రూ.8,115.06 కోట్లు కాగా రూ.6,406.71 కోట్లు (78.94శాతం) ఖర్చు చేశారు.
  • జూన్‌ 15 నాటికి 1,67,360 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు గృహనిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయింది జీహెచ్‌ఎంసీలోనే. లక్ష మంజూరుచేస్తే 84,555 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఆ తర్వాత- 15,773కు 10,245తో సిద్దిపేట జిల్లా రెండోస్థానంలో, 14,555కు 6,255 ఇళ్లతో ఖమ్మం జిల్లా మూడోస్థానంలో ఉన్నాయి.
  • కొన్ని జిల్లాల్లో పదులు, వందల సంఖ్యలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నారాయణపేట జిల్లాకు 1,803 మంజూరు చేస్తే పూర్తయినవి 44 మాత్రమే. వికారాబాద్‌ జిల్లాలో 4,323 ఇళ్లకు 442..కుమురంభీంలో 1,223కు 496..గద్వాలలో 2,470కు 605.. నాగర్‌కర్నూల్‌లో 3,210కు 668, మేడ్చల్‌లో 2,350కు 763, వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 4,118కు 989 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.

స్టీలు ధరల పెరుగుదలతో గుత్తేదారుల అనాసక్తి

మంజూరు చేసిన రెండు పడకగదుల ఇళ్లలో ఇంకా 21.87 శాతం ఇళ్ల నిర్మాణం అసలు మొదలేకాలేదు. దీనికి ప్రధానకారణం గుత్తేదారులు ముందుకు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. మిగతా ప్రాజెక్టులు, పనులతో పోలిస్తే రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంతో వచ్చే లాభం తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. కొవిడ్‌ కాలం నుంచి స్టీలు, సిమెంటు ధరలు గణనీయంగా పెరగడం మరింత ప్రభావాన్ని చూపిస్తోందని అధికారులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవతీసుకుని మాట్లాడిన చోట గుత్తేదారులు ముందుకు వస్తున్నారు. మిగతాచోట్ల రెండుపడక గదుల ఇళ్ల పనులు ముందుకు సాగట్లేదు. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా రూ.8,886.99 కోట్ల నిధులు కావాలి.

ABOUT THE AUTHOR

...view details