తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా' సెలవుల్లో.. పిల్లలతో ఇలా చేయించండి!

కరోనా వైరస్​ దెబ్బకు.. స్కూళ్లు మూతపడుతున్నాయి. బయటకు వచ్చేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గజగజ వణికిపోయే పరిస్థితి. మరి ఇంట్లో ఉండే చిన్నారుల సంగతేంటి? పాఠశాల ఉన్న సమయంలోనే పిల్లల అల్లరి మామూలుగా ఉండదు. ఇప్పుడు సెలవులు.. ముచ్చెమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. వారికి బోర్ కొట్టకుండా.. సృజనకు పదును పెట్టే.. ఆటలు ఆడిస్తే.. మంచిది కదా!

games
games

By

Published : Mar 18, 2020, 9:02 AM IST

ఇప్పుడు ప్రపంచమంతా.. కరోనా వైరస్ భయమే. బయటకు వెళ్లాలంటే.. వణుకు. ఈ మహమ్మారి కారణంగా పాఠశాలలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించేస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రాకుండా వైరస్​ను ఎదుర్కోవాలని సూచిస్తున్నాయి. పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు తంటాలు. వాళ్లు చేసే అల్లరికి టాప్ లేచిపోద్ది. పట్టపగలే చుక్కలు చూపిస్తారు. అలా అని బయటకూ పంపలేరు. మరి ఏం చేద్దామనుకుంటున్నారు? ఇలాంటి సెలవులు సరిగా వాడుకుంటే... వాళ్లను అందరికంటే ముందుండేలా తయారు చేయోచ్చు.. కొత్తగా ఆలోచించేలా చేయోచ్చు.

తెలివిని పెంచే ఆటలు

పిల్లలకు ఆటలాడటమంటే మహా ఇష్టం కదా.. అలా అని సెల్​ఫోన్​లో గేమ్స్​ వైపు.. చూసేలా చేయకండి. ఆన్​లైన్​కు దూరంగా ఆడుకునే గేమ్స్.. సృజనను పెంచే ఆటలు చాలానే ఉన్నాయి. కరోనా సెలవుల్లో మీ పిల్లలతో చెస్ ఆడించండి. ఆలోచన విధానం.. మారుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో.. వారికి తెలుస్తుంది. క్యారమ్, అష్టాచమ్మా, పచ్చిస్ ఇలాంటి ఆటలు పిల్లలతో ఆడిస్తే.. వారిలో పోటీ తత్వం పెరుగుతుంది. అంతే కాదు.. అంతరించిపోతున్న.. అష్టాచమ్మా, పచ్చిస్ లాంటి ఆటలు భవిష్యత్ తరాలకు అందించినవారవుతారు. ఈ ఆటలు ఆడుతూ.. కథలు చెబుతుంటే.. వాళ్లు హు.. కొడుతుంటే.. మీకూ ముచ్చటేస్తుంది.

పాటలు నేర్పించండి

మీ పిల్లలు ఇంట్లో పాడుతుంటే.. మీరు సంబరపడిపోతారా? అదే స్జేజీపై పాడితే.. వచ్చే కిక్కు ఇంకా ఎక్కువ. ఈ సెలవు దినాల్లో పిల్లలకు పాటల పోటీలు పెట్టండి. గెలిస్తే.. బహుమతి ఇస్తామని చెప్పండి. వాళ్లు రాగం తీస్తుంటే.. తల్లిదండ్రులకు చిన్నతనం గుర్తొస్తుంది. పాటలు పాడుతు.. గెంతుతూ.. వాళ్లు సంబరపడిపోతారు. ఏమో.. భవిష్యత్​లో మీ పిల్లలే గొప్ప గాయకులు కావచ్చేమో. ఇది పాటిస్తే.. పిల్లల అల్లరి తగ్గించడంతోపాటు.. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మార్కెట్లో చిన్న చిన్న మ్యూజిక్ పరికరాలు దొరుకుతాయి. అవి కొనిస్తే.. వారే వాటితో ఆడుకుంటారు కూడా.

డ్రాయింగ్ గొప్ప ఆర్ట్​

డ్రాయింగ్.. అనేది చాలా మంచి కళ. అప్పుడప్పుడేవేవో పిచ్చి గీతలు గీసి మీకు చూపిస్తారు కదా పిల్లలు. 'కరోనా' సెలవు దినాల్లో.. డ్రాయింగ్​పై దృష్టిపెట్టేలా చేయండి. ఏదైనా కార్టూన్ చూపించి.. దానిలా బొమ్మను గీయమనండి. సృజనాత్మకత పెరుగుతుంది.

భాష నైపుణ్యాలపై దృష్టి

మన తెలుగులో వేల పద్యాలున్నాయి. వాటిని కంఠతా పట్టించండి. అందులోని నీతిని పిల్లలకు బోధించండి. తెలుగును కాపాడుకున్న వాళ్లమే కాకుండా.. పిల్లలకు నీతి చెప్పినవాళ్లవుతారు. ఇలాంటి సెలవు దినాల్లో ఇంకో ముఖ్యమైన విషయం.. భాషా నైపుణ్యాలు నేర్పించడం. పెరిగి పెద్దవుతుంటే.. ఎన్ని భాషలోస్తే.. అని అవకాశాలు దొరుకుతాయి. ఇప్పటి నుంచే మీ పిల్లలకు భాషలపై పట్టు వచ్చేలా చేయండి. ఇతర భాషల్లోని ఒక్కొక్క పదాన్ని చెబుతూ.. సందర్భాన్ని బట్టి ఉపయోగించండి. భాషపై పట్టు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.

నీతి కథలు బోలెడు

మార్కెట్లో చాలా కామిక్ బుక్స్​ దొరుకుతాయి. అవి పిల్లలకు ఆసక్తిగా ఉంటుంది. ఆలోచన శక్తి పెరుగేందుకు కామిక్ బుక్స్ ఉపయోగపడతాయి. తెలుగులో నీతి కథలు అనేకం.. వాటిని చదివి వినిపించండి... వారితో చదివిస్తే ఇంకా మంచిది. సందర్భాన్ని బట్టి ఎలా మెలగాలో వారికి తెలిసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

వీరుల సినిమాలు అనేకం

లేదు మేం.. సినిమాలే చూస్తాం.. అని మారం చేసే పిల్లలు కొంతమంది ఉంటారు. వారికి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్​ లాంటి స్ఫూర్తిమంతమైన సినిమాలు చూపించండి. జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లేందుకు ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయి.

ఈ సెలవులను పిల్లలు సరిగా ఉపయోగించుకునేలా చేస్తే.. వారికి భవిష్యత్​లోనూ ఉపయోగపడతాయి. వీడియో గేమ్స్ అంటూ.. సమయం వృథా చేయిస్తే.. అప్పుడు ఇది చేయిస్తే.. బాగుండు.. అది నేర్పిస్తే.. ఇంకా బాగుండు.. అని మీరు భవిష్యత్​లో అనుకునే అవకాశం ఉంది. మీ పిల్లలను వందలో ఒకడిలా కాకుండా.. వంద మందికి ఒకడిలా తయారుచేయండి.

ఇదీ చదవండి:దూరం దూరం జరగండి- కరోనాను కట్టడి చేయండి

ABOUT THE AUTHOR

...view details