don't waste food : పండుగల రోజుల్లో, శుభకార్యాలు, ఫంక్షన్ హాళ్ల దగ్గర అతిథుల కోసం సిద్ధం చేసిన ఆహారం చాలా సార్లు మిగిలిపోతుంటుంది. అలాంటి పరిశుభ్రమైన ఆహారం మీ దగ్గర ఉంటే.. తమకు అందించాలని కోరుతున్నాడు.. నేమాని మహేశ్వరరావు. ఖాళీ కడుపులతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎంతో మంది పేదలకు.. డోంట్ వేస్ట్ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ ఆహారం అందిస్తామంటున్నాడు.
అప్పుడు మొదలైన ఆలోచన..
don't waste food NGO : రాజమండ్రిలో పుట్టి, నాగ్‌పూర్‌కు వలస వెళ్లిన.. ఓ నిరుపేద కుటుంబం మహేశ్వరరావుది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతను.. ఎన్నో కష్టాల మధ్య చదువుకున్నాడు. రోజు కూలీగా పనిచేస్తూ ఇంటిని పోషించుకున్నాడు. దాతలు, ప్రభుత్వ సహకారంతో బీటెక్ పూర్తి చేసిన ఈ కుర్రాడు.. చదువుకునే రోజుల్లో ఖర్చుల కోసం క్యాటరింగ్‌కు వెళ్లేవాడు. అలా మొదటిసారి తానెళ్లిన ఫంక్షన్లో మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి పేదలకు అందించాడు.. అప్పటి నుంచి అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు.
డోంట్ వేస్ట్ ఫుడ్ సంస్థకు నాంది..
don't waste food Foundation : స్నేహితుల సూచనలు, సహకారంతో.. 2011లో డోంట్ వేస్ట్ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఓ ట్రావెల్ సంస్థలో పనిచేస్తూ.. రాత్రి వేళ హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి ఆహారం సేకరిస్తున్నాడు. మిగిలిన ఆహారమే అయినా.. నాణ్యంగా ఉంటేనే స్వీకరిస్తున్నారు. తాము తినేందుకు అనువుగా ఉంటేనే.. ఇతరులకూ పంచుతామంటున్నారు.. ఈ సంస్థ సభ్యులు.
నాణ్యంగా ఉంటేనే పంచుతాం..
don't waste food Volunteers : హోటళ్లో మిగిలిపోయిన ఆహారమే కాదు.. పేదలకు పంచేందుకు కొందరు దాతలు సైతం ఆహారం సిద్ధం చేసి అందిస్తున్నారు. ఆ ఆహారాన్ని డోంట్ వేస్ట్ ఫుడ్ సంస్థ పంపిణీ చేస్తోంది. జంట నగరాల్లోని బసవతారకం, నిమ్స్, నిలోఫర్ వంటి ఆసుపత్రుల దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లల్లో నిస్సహాయంగా ఉన్న వారికి పంచుతున్నారు. నగరంలోని మురికివాడల్లో తిరిగి.. వృద్ధులు, కూలీలు, బాల కార్మికులకు ఆహారం చేరవేస్తున్నాడు.. ఈ యువకుడు.