DOLLAR SESHADRI DEAD BODY IN TIRUPATHI: తిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం సేవలందించిన డాలర్ శేషాద్రి పార్థివదేహానికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి నివాళులు అర్పించారు. విశాఖలో సోమవారం ఉదయం శేషాద్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ.. డాలర్ శేషాద్రి పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అసలెలా జరిగింది?
DOLLAR SESHADRI PASSES AWAY: సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన విశాఖ వచ్చారు. అదేరోజు సాయంత్రం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవమూర్తుల కల్యాణ రథంలో విశాఖలోని తితిదే కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఉత్సవమూర్తులను దించి, స్వామి పవళింపు సేవలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కల్యాణ మండపంలోనే నిద్రకు ఉపక్రమించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఛాతీనొప్పి రావడంతో వ్యక్తిగత సహాయకులు రాంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే శేషాద్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.