భాగ్యనగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే పదుల సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందే కాకుండా కార్యాలయాలు, ఆసుపత్రుల్లో పరిపాలన విభాగాల్లోని సిబ్బంది, ఉద్యోగులు సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారు క్వారంటైన్‌లో ఉంటే సెలవులు కాకుండా ఆన్‌డ్యూటీగా పరిగణించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.
క్వారంటైన్ సమయంగా నిర్ణయించిన 17 రోజులను ఆన్‌డ్యూటీగా పరిగణించాలని సూచించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాల అధికారులు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కింగ్‌కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రి పరిధిలోని సిబ్బంది, వైద్యులను ఉద్దేశించి ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ఆయా కార్యాలయాల అధిపతుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో కరోనా బారిన పడ్డ వైద్యులు, ఇతర సిబ్బంది సొంత సెలవులు పెట్టుకుని క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి.