‘అపస్మారక స్థితిలో ఉన్న మా బిడ్డను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళితే, అక్కడి డాక్టర్ చనిపోయిందని ధ్రువీకరించారు. బ్రాట్ డెడ్ (ఆసుపత్రికి వచ్చేలోగానే చనిపోయినట్లు) అని చీటీ రాసి మా చేతిలో పెట్టేశారు. నమ్మకం కుదరక మేం సంగారెడ్డి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు బతికే ఉందన్నారు. చికిత్స అందించి కోలుకునేలా చేశారు’ అని బాధిత యువతి తల్లిదండ్రులు వాపోయారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై వారు గురువారం తెలిపిన వివరాల ప్రకారం... జహీరాబాద్ మండలం చిన్నహైదరాబాద్‌కు చెందిన అర్చన(20)కు ఇటీవల మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన యువకుడితో వివాహమైంది. ఉపవాస దీక్షలో ఉన్న అర్చన మే 7న తెల్లవారుజామున అత్తారింట్లో కిందపడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న జనరల్ సర్జన్ డా.సంతోష్ పరీక్షించి, చనిపోయినట్లు చెప్పి ఆసుపత్రి చీటీపై ‘బ్రాట్ డెడ్’ అని రాసిచ్చారు. ఆసుపత్రి రిజిస్టర్‌లో సంతకం చేయించుకున్నారు.
బతికించిన నమ్మకం..
వైద్యుడు చెప్పింది నమ్మని అర్చన తల్లిదండ్రులు నర్సింహులు, శారద జహీరాబాద్ నుంచి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆమె బతికున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించారు. మే 22న డిశ్ఛార్జి చేశారు. వారం రోజుల తర్వాత మే 28న మరోసారి పరీక్షించి, పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టంచేశారు. ప్రభుత్వ వైద్యుడి నిర్వాకంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకున్నామని బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఆసుపత్రి రిజిస్టర్‌లో అర్చన చనిపోయినట్లు రాసిన పేజీలోని స్థలంలో... కొత్తగా కాగితం అతికించి, మరో ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు రాసి ఉండటం గమనార్హం.