సర్.. ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం... ఈ రోజు ఉదయం 9 మందికి రెండుసార్లు రక్త నమూనాలు తీసుకున్నాం. తొలి నమూనాలకు చేసిన కొవిడ్-19 పరీక్షలో ఫలితం నెగిటివ్ వచ్చింది.. వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పి పంపించాం.. రాత్రి రెండో నమూనాలకు చేసిన పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అందువల్ల వారిని వెంటనే రప్పించండి. లేకపోతే వారితో దగ్గరగా తిరిగేవారికి కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలున్నాయ్. వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇన్‌స్పెక్టర్‌కు పంపించాం. వెంటనే స్పందించండి.
కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆసుపత్రి నుంచి పోలీస్ ఉన్నతాధికారులకు సోమవారం రాత్రి వచ్చిన ఫోన్‌కాల్ సారాంశమిది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి చేర్చారు. మరోసారి ఇలాంటి సమాచారమే మంగళవారం కూడా పోలీస్ అధికారులకు వచ్చింది. తక్షణం పాజిటివ్ వచ్చిన వ్యక్తులను పోలీసులు తీసుకువచ్చారు.
గత నెల మార్చి 15 నుంచి..
హైదరాబాద్‌లో వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు పోలీస్, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. తమ పరిధుల్లో నివాసముంటున్న వారి వివరాలను సేకరించి అనుమానిత లక్షణాలతో ఉన్నవారిని నిర్ధరణ కోసం గత నెల 15 నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన కొందరిలో కరోనా వైరస్ వచ్చినట్టు అనుమానిస్తుండడంతో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఆసుపత్రికి తీసుకువస్తున్నారు.