20 Crore donation by Dr.Uma: తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు ఆ వైద్యురాలు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి తన దగ్గర ఒక్క రూపాయి సైతం మిగుల్చుకోలేదు. మొత్తంగా రూ.20 కోట్ల (2.50 మిలియన్ డాలర్లు)చేసే తన ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మించబోయే మాతా శిశు సంక్షేమ భవనం కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు డాక్టర్ ఉమ. గుంటూరు జిల్లాకు చెందిన ఆమె అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆమె 1965లో గుంటూరు వైద్య కళాశాలలో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లారు. ఇమ్యునాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ పాల్గొన్నారు. తాను మెడిసిన్ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు. తన చేతిలో డాలర్ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. గతంలో ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు.