ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన మత్తు వైద్యుడు సుధాకర్ గుండెపోటుతో మృతి చెందారు. ఎన్95 మాస్కుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు సహా జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రెండు ఘటనలతో గతంలో సుధాకర్ వార్తల్లో నిలిచారు. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసింది. ఈ అంశంపై విచారించిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది.
అసలేం జరిగిందంటే..
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న సుధాకర్.. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని.. ప్రజాప్రతినిధులు సైతం ఆసుపత్రిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ 8న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.