తెలంగాణ

telangana

ETV Bharat / city

అవతార్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స.. ఎక్కడో తెలుసా? - గుంటూరులో ఆపరేషన్​ చేసే సమయంలో అవతార్ సినిమా వార్తలు

ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వస్తే రోగికి మత్తు తప్పనిసరి. కానీ.. మత్తు లేకుండా శస్త్రచికిత్స అంటే.. వామ్మో కష్టమే కదా అనుకుంటున్నారా? అయితే.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రోగి స్పృహలో ఉండగానే.. మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించిన ఏపీలోని గుంటూరు వైద్యులు.. ప్రత్యేకత చాటుకున్నారు. రోగికి అవతార్ సినిమాతో పాటు, ఇష్టమైన నటుని టీవీ షో చూపిస్తూ చికిత్సను పూర్తి చేశారు. వినేందుకు కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం.

అవతార్ సినిమా చూపిస్తూ.. శస్త్రచికిత్స
అవతార్ సినిమా చూపిస్తూ.. శస్త్రచికిత్స

By

Published : Nov 21, 2020, 12:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన బత్తుల వరప్రసాద్​కు మెదడులో కణతి ఏర్పడింది. ఇందుకు సంబంధించి గతంలో ఓసారి హైదరాబాద్​లో శస్త్రచికిత్స జరిగింది. రెండో విడత ఆపరేషన్ కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. అక్కడ పనిచేసే నాడీసంబంధ వైద్యులు హనుమ శ్రీనివాసరెడ్డి అన్నిరకాల పరీక్షలు చేసి మెదడుకు ఆపరేషన్ చేసి కణితి తొలగించాలని చెప్పారు. మెదడు వంటి కీలక అవయవాలకు ఆపరేషన్ క్లిష్టమైన ప్రక్రియ. నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేయిస్తూనే ఆపరేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఏ మాత్రం తేడా వచ్చినా..

ఏ మాత్రం తేడా వచ్చినా రోగి ప్రమాదంలో పడతారు. అందుకే ఇలాంటి ఆపరేషన్లను రోగి స్పృహలో ఉండగానే చేస్తుంటారు. అందుకు రోగి ఎంతో ధైర్యంతో ఉండాలి. ఈ క్రమంలో రోగి ప్రశాంతంగా ఉండి ఆపరేషన్​కు సహకరించేందుకు విభిన్న మార్గాలు అనుసరిస్తుంటారు. హనుమ శ్రీనివాసరెడ్డి మాత్రం రోగికి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేయటంలో పేరుగాంచారు. శస్త్రచికిత్స చేసే సమయంలో తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ఈ విధానం అనుసరిస్తున్నారు. నాడీవ్యవస్థపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు తన ల్యాప్ టాప్​లో సినిమా, టీవి షో చూపిస్తూ రోగి స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ విజయవంతంగా ముగించారు. ఈ శస్త్ర చికిత్సలో ఇంకో న్యూరో సర్జన్ శేషాద్రి శేఖర్, మత్తు వైద్యులు త్రినాథ్ పాలుపంచుకున్నారు.

అరుదైన విషయం..

ఇలాంటి శస్త్రచికిత్సలు విదేశాల్లో తరచుగా జరుగుతుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగడం అరుదైన విషయం. ఆపరేషన్​కు ముందు రోగికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ గురించి వివరిస్తారు. మేలుకుని ఉండగానే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పగానే వరప్రసాద్ అంగీకరించారు. దీంతో వైద్యులు కేవలం ఆపరేషన్ చేసే ప్రాంతంలో నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చారు. మనిషి మాత్రం స్పృహలోనే ఉన్నారు. ఆపరేషన్ చేసే సమయంలో సినిమా చూస్తూ, టీవి షో సంగీతానికి అనుగుణంగా స్పందిస్తూ రోగి కూడా వైద్యులకు పూర్తిస్థాయిలో సహకరించాడు. ఈనెల 10వ తేదిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు వరప్రసాద్ తెలిపారు.

గతంలో బాహుబలి సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసిన అనుభవం శ్రీనివాసరెడ్డికి ఉంది. మూడేళ్ల క్రితం చేసిన ఈ శస్త్రచికిత్స గురించి అంతర్జాతీయ వైద్య జర్నల్స్ లో ప్రచురితమైంది. ఇప్పుడు కూాడా అదే కోవలో సినిమా, టీవిషో చూపిస్తూ ఆపరేషన్ ముగించారు.

ఇదీ చదవండి:మాస్కులతో ఊపిరితిత్తులు దెబ్బతినవు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details