రెండో దశలో కరోనా మహమ్మారి వందల మంది ప్రాణదాతలను బలితీసుకుంటోంది. వైరస్ ధాటికి వైద్యులూ ప్రాణాలు కొల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరి గ్రామానికి చెందిన కందికట్ల రోజి అనే వైద్యురాలు కరోనా కారణంగా మరణించారు. ఏలూరులోని ఆశ్రమ్ ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా ఆమె సేవలందించారు. అక్కడే ఆమెకు కరోనా సోకగా.. మోరిలోని ఇంటికి వచ్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం స్థానికంగా ఉన్న సుబ్బమ్మ ఆస్పత్రిలో చేర్చగా.. మంగళవారం ఉదయం చనిపోయారు.
ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి రోజి వైద్యానికి సహకరించలేదని, ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయి తగ్గి మరణించారని వైద్యుడు క్రాంతికిరణ్ వెల్లడించారు. రోజికి తమ్ముడు, తల్లి ఉన్నారు. ఆమె తల్లి గల్ఫ్‌లో పని చేస్తున్నారు. తండ్రి 15 ఏళ్ల కిందట చనిపోయారని బంధువులు వెల్లడించారు. కష్టపడి చదువుకుని వైద్యురాలు అవుతుందని కలలుకన్న తమకు.. ఇలా దూరమై కన్నీరు మిగిల్చిందని వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.