కరోనా కట్టిడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్ల ఆకలితో అలమటిస్తున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తమ వంతుగా తోచిన సాయం చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి 4లక్షల 44వేల 444 రూపాయలు విరాళం ప్రకటించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌కు చెక్కును అందజేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్, అరోషికా దంపతులు పోలీసుల సంక్షేమ నిధికి పదిలక్షల రూపాయలు అందించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు చెక్కు అందించారు. ఎస్ఎస్బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి 10లక్షల విరాళం ఇచ్చింది. సంస్థ ప్రతినిధులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్వర్యంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు.
కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల సంక్షేమ సంఘాల సమాఖ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మాల్కాజిగిరి ఏసీపీ నర్సింహరెడ్డి, సమాఖ్య ఛైర్మన్ రాపోలు రాములు, మున్సిపల్ కొర్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ ఆర్ శంకర్, ఉప మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, సీఐ అంజిరెడ్డి పాల్గొన్నారు. సైబర్‌బాద్ పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహాకారంతో... ఫోరం సుజన మాల్ రోజూ 500 ఆహార ప్యాకెట్లు నిరుపేదలకు అందజేసోంది. సీఎస్‌ఆర్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్ ఎత్తి వేసే వరకు కొనసాగిస్తామన్నారు.
పాత్రికేయులకూ...
హైదరాబాద్‌లో పాత్రికేయులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. గోషామహల్‌లో ప్రతిరోజు రెండు పూటల 3వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అవతార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజు 2వేల అన్నం ప్యాకెట్లను పేదలకు పంపిణీ చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రోజువారీ కూలీలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో లక్డీకపూల్‌లో రోజూ 4000వేల ఆహార పొట్లాలు అందజేస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో దినసరి కూలీలకు స్థానిక కౌన్సిలర్ నిత్యవసర వస్తువులు అందించగా.. హైదరాబాద్ ఏబీవీపీ ప్రధాన కార్యలయం వద్ద.. పారిశుద్ధ కార్మికులకు విద్యార్థి నాయకులు నిత్యవసరాల సరుకులు పంపిణీ చేశారు.