- ప్రేమికుల రోజున మన మనసుకు నచ్చిన వారికి అందించడానికి రోజా పూలను కొనుగోలు చేయడం తెలిసిందే. అయితే వీరిలో 73 శాతం మంది పురుషులు కాగా.. 23 శాతం మంది మాత్రమే అమ్మాయిలు తమకు నచ్చిన వారికి పూలను సింగిల్‌గా లేదంటే బొకేల రూపంలో అందిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
- వాలంటైన్స్ డే సందర్భంగా ఏటా దాదాపు 35 మిలియన్లకు పైగా హృదయాకారంలో ఉండే చాక్లెట్ బాక్సులు కొనుగోలవుతున్నాయట! అంతేకాదు.. ఈ రోజున కేవలం చాక్లెట్లకే సుమారు 7 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు రుజువైంది.
- ఈ రోజున ఎక్కువమంది మగవారేమో తమకు నచ్చిన అమ్మాయిలకు కానుకివ్వడానికి పూలను కొనుగోలు చేస్తే.. దాదాపు 85 శాతం మంది అమ్మాయిలు విభిన్న రకాలైన బహుమతులతో తమ మనోహరుడిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట..!
- ప్రేమికులంతా ఎంతో ప్రత్యేకంగా భావించే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున లవర్స్ గ్రీటింగ్ కార్డుల్ని ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అయితే విక్టోరియా కాలంలో మాత్రం ఈ కార్డుల్ని దురదృష్టానికి చిహ్నంగా భావించేవారట..!
- ఫిన్‌ల్యాండ్‌లో వాలంటైన్స్ డే ని 'ఫ్రెండ్స్ డే' పేరుతో జరుపుకొంటారట..! ఈ రోజున తమ మనసుకు నచ్చిన వారి కంటే తమ ప్రాణ స్నేహితులతో గడపడానికే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారట..!
- యూరప్‌లో 5-15వ శతాబ్దం మధ్య కాలంలో అమ్మాయిలు ఈ రోజున తమకు కాబోయే భర్తను మనసులో తలచుకుంటూ కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తినేవారట..!
- ఎదుటి వ్యక్తిపై మన మనసులోని ప్రేమను తెలపడానికి చాక్లెట్లను బహుమతిగా అందిస్తుంటాం. అయితే ఆ చాక్లెట్లు బ్రేకప్ అయిన మనసుని ప్రశాంతపరచడానికి కూడా ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు. అందుకే ప్రేమ బంధం వీగిపోయి పలు మానసిక సమస్యలతో తమ దగ్గరకొచ్చేవారికి చాక్లెట్లు తినమని చెబుతామని అంటున్నారు కొందరు సైకాలజీ నిపుణులు.
- ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలపడం కంటే తమని తామే ప్రేమించుకోవడానికి, కానుకలిచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట కొందరు అమెరికన్ మహిళలు. ఇలా ఏటా వాలంటైన్స్ డే రోజున 15 శాతం మంది అమెరికన్ మహిళలు తమకు తామే పువ్వులు, ఇతర బహుమతుల్ని అందించుకుంటూ తమని తాము ప్రేమించుకోవడం అత్యంత అవసరమని ప్రపంచానికి చాటుతున్నారు.
- ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ మనసుకు నచ్చిన వారికి ఎరుపు రంగు రోజాలను అందిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు ప్రేమికులు. అయితే ఎరుపు రంగు రోజానే ఎందుకంటే.. ఎర్రగులాబీ అనేది రోమన్ల ప్రేమ దేవత అయిన 'వీనస్'కి ఎంతో ఇష్టమైన పువ్వు.. అలాగే ఎరుపు రంగు రొమాన్స్‌కి చిహ్నం.. కాబట్టి ఈ రెండింటి కలయికగా ఈ రోజున ఎరుపు రంగు గులాబీలను అందించడం నాటి నుంచి కొనసాగుతోంది.
- ప్రముఖ కవి విలియమ్ షేక్‌స్పియర్ నవలలో రోమియో-జూలియట్ పాత్రలు కల్పితమే అయినా వారిని ప్రేమకు ప్రతిరూపాలుగా భావించడం మనకు తెలిసిందే. అయితే ఆ కథలో భాగంగా ఇటలీలోని వెరోనా నగరంలో ఎక్కడైతే రోమియో అవతరించాడో అక్కడికి జూలియట్ పేరుతో ఏటా కొన్ని వేల ప్రేమలేఖలు చేరుకుంటాయట. ఇలా మరణం లేని ప్రేమికులుగా రోమియో-జూలియట్‌లను పేర్కొంటారు లవర్స్.
- ప్రేమంటే కేవలం ఒక అమ్మాయి- అబ్బాయి మధ్య మాత్రమే కాదు.. తల్లీబిడ్డలు, టీచర్స్-విద్యార్థులు, భార్యాభర్తలు.. వంటి బంధాలతో పాటు మూగజీవాలతోనూ మనం ప్రేమగా మెలుగుతుంటాం. అందుకే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులే కాదు.. పేరెంట్స్‌కి, టీచర్స్‌కి, పెట్స్‌కి కూడా కానుకల్ని అందించి వారిపై మనకున్న ప్రేమను చాటుకుంటాం. అలా ఏటా అందరికంటే ఎక్కువగా కానుకలు, వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులు ఎవరు అందుకుంటున్నారో తెలుసా? ఇంకెవరు.. ప్రతి విద్యార్థిని సన్మార్గంలో నడిపించే టీచర్లే. చిన్నారులు, అమ్మలు, భార్యలు, ప్రేమికులు, పెట్స్.. వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించారు.
- ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికుల మధ్య ప్రేమ ప్రతిపాదనలే కాదు.. పెళ్లి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయట. అలా ఏటా సగటున 2 లక్షలకు పైగా పెళ్లి ప్రతిపాదనలు చేస్తున్నారట!
Valentine's Day: ప్రేమికుల రోజు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? - Valentine's Day special story
ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే ప్రేమ పండగే వాలంటైన్స్ డే. ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ వాలంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలనే ఎందుకు కానుకగా అందిస్తారు? ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే రోమియో-జూలియట్ ఎవరు? ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాల సమాహారం మీకోసం..
Do you know these interesting things about Valentine's Day