హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించనుంది. ఇంటింటికీ వెళ్లి సాయాన్నిఅందించాలన్న ప్రభుత్వం... కుటుంబ, భౌగోళిక వివరాలను యాప్లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. వరద ప్రభావానికి గురైన ఏ ఒక్కరికీ సాయం అందకుండా ఉండరాదని స్పష్టం చేసింది. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.
ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో నగరంలో వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహయనిధి నుంచి రూ.550 కోట్లు పురపాలకశాఖకు విడుదల చేశారు. ఆర్థికసాయాన్ని ఇవాళ్టి నుంచే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా విధివిధానాలను పురపాలక శాఖ ప్రకటించింది.
ప్రత్యేకాధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ లేదా ఇతర శాఖల అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా సాయాన్ని అందించాలని ప్రభుత్వం తెలిపింది. మురికివాడలు సహా ఇతర ప్రాంతాల్లో వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు సాయం అందించాలని సూచించింది. ఏ ఒక్క బాధితులకు సాయం అందకుండా ఉండరాదని స్పష్టం చేసింది. ఇళ్ల వద్దకే వెళ్లి సాయం చేయాలని సూచించిన ప్రభుత్వం.. యాప్లో కుటుంబ వివరాలతో పాటు ఆ ఇంటి భౌగోళిక వివరాలు నమోదుచేయాలని సూచించింది. ఆధార్, రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలని సూచించింది.