తెలంగాణ

telangana

ETV Bharat / city

'దిశ' కంఠుల హతం.. ప్రజల హర్షం

అంతా అనుమానించినట్లే.. ఎక్కువమంది ఆశించినట్లే జరిగింది. ‘దిశ’ కేసులో నిందితులకు ‘సత్వర’ శిక్ష పడింది. ఒంటరి ఆడపిల్ల పట్ల పాశవికంగా వ్యవహరించిన మృగాళ్లకు పోలీసులు మరణశాసనం రాశారు. రాక్షసకాండ సాగించిన వారం వ్యవధిలోనే.. ‘పోలీస్‌ మార్కు తీర్పు’ వెలువడింది. ఆమెపై పెట్రోలు పోసి దహనం చేసిన ప్రాంతానికి సమీపంలోనే.. ఆ దుర్మార్గుల కథ ముగిసింది. ఆమె ఆక్రందనలు గాలిలో కలిసిపోయినచోటే తూటాలు గర్జించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై జనం ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. పలువురు మేధావులు, న్యాయకోవిదులు విమర్శలు గుప్పిస్తున్నారు. సమస్యకు ఇది పరిష్కారం కాదంటున్నారు.

disha case overall story
'దిశ' కంఠుల హతం.. ప్రజల హర్షం

By

Published : Dec 7, 2019, 6:33 AM IST

Updated : Dec 7, 2019, 12:57 PM IST

'దిశ' కంఠుల హతం.. ప్రజల హర్షం

దిశపై జరిగిన కిరాతకానికి జాతి మొత్తం స్పందించింది. పిల్లలున్న ప్రతి తల్లీ కన్నీరు కార్చింది.. ఆడబిడ్డలున్న ప్రతి తండ్రీ ఆవేదన చెందాడు.. పార్లమెంటు దిగ్భ్రాంతి చెందింది.. పార్టీలకతీతంగా నేతలు స్పందించారు.. అన్ని ప్రాంతాల్లో కట్టలు తెంచుకున్న ఆవేశంతో సామాన్యులు కూడా రోడ్ల మీదకు వచ్చారు. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. జరిగిన కిరాతకాన్ని తీవ్రంగా ఖండించారు.

పోలీసులపై పూలవర్షం..

నిందితులు పోలీసుల చేతిలో హతమైన విషయం తెలియగానే జనమంతా సంబరాలు చేసుకున్నారు. కేసుల సాగతీత.. విచారణలో విపరీతమైన జాప్యం, కోర్టుల్లో కాలహరణంతో విసిగిపోయి ఉన్న సామాన్యులు పోలీసుల చర్యను కీర్తించారు.. విద్యావంతులు కూడా చట్టాలు, కోర్టుల గురించి మరిచిపోయినట్టే స్పందించారు. ఈ రాక్షసుల విషయంలో పోలీసులు చేసిందే సరైన.. ‘సత్వర న్యాయమంటూ’ నినదించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి తండోపతండాలుగా.. వేలాదిగా చేరుకున్న జనం పోలీసులపై పూల వర్షం కురిపించారు. తగిన శాస్తి జరిగిందంటూ తేల్చిచెప్పారు.

నేరమేంటి..

దేశాన్ని పట్టి కుదిపేసిన ‘దిశ’ కేసులో నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. గతనెల 27న శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద ‘దిశ’ తన ద్విచక్ర వాహనాన్ని పార్క్‌చేసిన విషయాన్ని గమనించిన మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ మహ్మద్‌ అలీ, చింతకుంట చెన్నకేశవులు, జల్లు నవీన్‌, జొల్లు శివ అనే లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఆమె తిరిగి వచ్చాక కిడ్నాప్‌ చేశారు. ప్రధాన రహదారి పక్కనే గోడ చాటుకు లాక్కెళ్లి నలుగురూ మూకుమ్మడిగా లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను 30 కిలోమీటర్ల దూరంలోని చటాన్‌పల్లి గ్రామం వద్ద ఉన్న కల్వర్టు కిందకు చేర్చి దహనం చేశారు. ఈ సంఘటన జరిగిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ రాత్రి దిశ తండ్రి, సోదరి ఫిర్యాదు చేయడానికి రాగా పరిధుల పేరుతో పోలీసులు తిప్పించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

ఏ క్షణం ఏం జరిగింది..

నిందితులను అరెస్టు చేసి నవంబరు 30న న్యాయస్థానంలో ప్రవేశపెట్టి చర్లపల్లి జైలుకు తలించారు. దర్యాప్తులో కోసం నిందితులను విచారించేందుకు పదిరోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగా షాద్‌నగర్‌ న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 4న నిందితులను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజులపాటు విచారించారు. దిశ సెల్‌ఫోన్‌, చేతిగడియారం, పవర్‌బ్యాంక్‌లను చటాన్‌పల్లి కల్వర్టు సమీపంలోనే దాచిపెట్టినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పదిమంది పోలీసుల బృందం శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితులను తీసుకొని దిశను దహనం చేసిన కల్వర్టు వద్దకు చేరుకుంది. దాచిపెట్టిన వస్తువులు ఇక్కడున్నాయి, అక్కడున్నాయి అంటూ నిందితులు సమీపంలోని పొలాల్లో తిప్పారు. అనంతరం 5.45 గంటల ప్రాంతంలో కల్వర్టుకు ఎడమవైపు 400 మీటర్ల దూరంలో మైదాన ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కలిసి మూకుమ్మడిగా పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌లు గాయపడ్డారు. లొంగిపొమ్మని హెచ్చరించినా నిందితులు పెడచెవిన పెట్టారని, అదే క్రమంలో ఆరిఫ్‌, చెన్నకేశవులు పోలీసుల వద్ద 9ఎంఎం పిస్టళ్లను లాక్కొని తమపై కాల్పులు జరిపారని, దాంతో తాము ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులూ హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ తతంగమంతా ఉదయం 6.15 గంటలకు ముగిసింది. పది నిమిషాలపాటు ఎదురుకాల్పులు కొనసాగిన తర్వాత నిందితుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా నలుగురు నిందితులు నిర్జీవులుగా కనిపించారు.

కస్టడీ అంతా రహస్యం..

దిశ ఉదంతంపై దేశవ్యాప్తంగా పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన 24 గంటల్లోనే నిబంధనల ప్రకారం రిమాండుకు తరలించారు. అయితే దర్యాప్తులో భాగంగా వీరిని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ మాత్రం పోలీసులు తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు. సోమవారం కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయగా అదేరోజు న్యాయస్థానం అనుమతించింది. కాని పోలీసులు మాత్రం దాన్ని దాచిపెట్టారు. ఎదురు కాల్పుల్లో నిందితులు హతమయ్యే వరకూ వారు పోలీసు కస్టడీలో ఉన్న సంగతి బయటికి తెలియకపోవడం గమనార్హం.

చీకట్లో ఎందుకు తీసుకువెళ్లారు?

నిందితులను పట్టపగలు బయటకు తీసుకొస్తే జనం తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతోనే ఎవరికీ తెలియకుండా తెల్లవారుజామునే తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.

ఉదయం నుంచి అక్కడే సజ్జనార్‌

ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నిందితుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించే వరకూ అంటే సాయంత్రం 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్‌కౌంటర్‌ వివరాలను వెల్లడించారు. ఆయనతోపాటు డీసీపీలు ప్రకాష్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, పద్మజ, అనసూయ, విజయ్‌కుమార్‌, రోహిణీప్రియదర్శిని, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌లు అక్కడే ఉన్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి శవపరీక్షల కోసం మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు.

నాలుగు మృతదేహాలు నాలుగుచోట్ల

దిశను దహనం చేసిన కల్వర్టుకు ఎడమవైపు పొలాల మధ్య చిన్న కాలిబాట మాత్రమే ఉంది. దాదాపు 400 మీటర్ల దూరం నడిచిన తర్వాత కొంత మైదాన ప్రాంతం ఉంది. అటు నుంచి పొలాల మధ్యగా కిలోమీటరు దూరం వెళితే దూసుకల్లు గ్రామానికి వెళ్లే దారి వస్తుంది. అక్కడ వెంకటయ్య అనే రైతుకు చెందిన ఖాళీ స్థలం మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో నలుగురూ హతమయ్యారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆరిఫ్‌, చెన్నకేశవులు కుడి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరికి కొంత దూరంలో నవీన్‌, శివల మృతదేహాలు ఉన్నాయి.

ఇవీచూడండి: మానసిక అత్యాచారాలెన్నో... మనసు పడే వేదనలెన్నో!

Last Updated : Dec 7, 2019, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details