దళిత బంధు పథకానికి కేటాయించే నిధులపై స్పష్టత ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Bhatti Vikramarka) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళితబంధుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పలు సూచనలు చేశారు. ఈ పథకాన్ని రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరారు. వీలుంటే దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న ఇతర అణగారిన వర్గాలకు కూడా దళితబంధు పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పథకాన్ని రాష్ట్రంలోని 4 మండలాల్లో మొదటి పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారన్న భట్టి(CLP Leader Bhatti Vikramarka).. తన నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా అందులో ఉందని తెలిపారు. ఇటీవల ఆయన చింతకానికి వెళ్లినప్పుడు.. అక్కడి ఎస్సీలతో మాట్లాడానని చెప్పారు. వారు తమకున్న కొన్ని సందేహాలను అడిగారని.. అవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని వారికి దళితబంధు కింద నగదు ఇవ్వాలంటే లక్షా 70వేల కోట్లు ఖర్చు అవుతుందని భట్టి(CLP Leader Bhatti Vikramarka) అంచనా వేశారు. కానీ ఎస్సీల ఆర్థిక సాధికారత కోసం వేయి కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారని.. ఇప్పుడు ఎస్సీలందరికి ఈ పథకం అమలు చేయడానికి నిధులు ఎక్కణ్నుంచి తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు నగదు ఇవ్వడానికి బడ్జెట్లో స్పష్టమైన నిధులను కేటాయిస్తారా లేదా.. ఏ సంవత్సరానికి ఎంత కేటాయిస్తామన్నది చెబుతారా అని అడిగారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని కోరారు.