RGV on Jubilee Hills Gang Rape Case:రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసుపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ఘటనకు సంబంధించినంత వరకు ఒక సామాన్యునిగా ఆలోచిస్తే.. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఆయన తప్ప మిగిలిన వాళ్లంతా.. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడటం బాధాకరమని తనదైన శైలిలో పేర్కొన్నారు.
"జూబ్లీహిల్స్ ఘటనపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగతా వారంతా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం బాధాకరం." - రాంగోపాల్ వర్మ, దర్శకుడు
జూబ్లీహిల్స్ ఘటన బాహ్య ప్రపంచానికి తెలియక ముందే దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖల పిల్లలు ఉండటంతోనే కేసు దర్యాప్తును పోలీసులు నీరుగారుస్తున్నారని ఆరోపణలు చేశారు. ఘటనకు సంబంధించి కొన్ని కీలకమైన ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. కాగా.. ఘటనలో బాధితురాలితో పాటు ఒక్కరు తప్ప మిగతా నిందితులంతా కూడా మైనర్లు కావటం వల్ల.. ఆ ఫొటోలు, వీడియోలు బయటపెట్టినందుకు రఘునందన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ప్రధాన నిందితుడు మేజర్ కాగా.. అతడిని మూడు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మిగతా మైనర్లను జువైనల్ కోర్టుకు తరలించారు.
సంబంధిత కథనాలు..