దిశ కేసు నిందితుల మృతదేహాలకు దిల్లీకి చెందిన నిపుణులతో మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు హైకోర్టును కోరారు. ఆధారాల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను సమర్పించారు.
సుప్రీం ఏం చెప్పిందంటే..?
- సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం.. దిల్లీకి చెందిన నిపుణులతో వైద్య బోర్డు ఏర్పాటు చేసి మళ్లీ శవపరీక్ష జరిపిస్తామని పేర్కొంది.
- ఇతర రాష్ట్రాల నిపుణులతో రీ - పోస్టుమార్టం చేయించాలని పిటిషనర్లు అడగలేదని.. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
- ఆధారాల సేకరణ కోసం తగిన ఉత్తర్వులు ఇవ్వొచ్చునని సుప్రీంకోర్టు తమకు స్వేచ్ఛనిచ్చిందని హైకోర్టు తెలిపింది.
- సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. రీపోస్టుమార్టం కోసం ఆదేశించే విచక్షణాధికారం హైకోర్టుకు ఉందని పేర్కొంది.
- ఒకవేళ మళ్లీ శవపరీక్ష అవసరమనుకుంటే.. తెలంగాణలో చాలా మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారని అడ్వొకేట్ జనరల్ వాదించారు.
ప్రపంచం గమనిస్తోంది..!
ఎన్కౌంటర్ పట్ల తెలంగాణ న్యాయ, పోలీసు వ్యవస్థ తీరును ప్రపంచమంతా గమనిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశమని పేర్కొంది. ఎన్కౌంటర్ పై తాము అనుమానాలు వ్యక్తం చేయడం లేదని.. అయితే విచారణలో నిజాయితీ, పారదర్శకత ప్రదర్శించాలని అభిప్రాయపడింది.