తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా కాలం.. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు..!

సాంకేతిక పరిజ్ఞానం జీవన శైలిని సులభతరం చేసింది. కరోనా సమయంలో ఇది మరింతగా జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది. ఆన్ లైన్ కార్యకలాపాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్థిక లావాదేవీలతో పాటు సమాచార వినిమయం, వినోదం, ఆరోగ్యంలో టెలిమెడిసిన్ , క్రయవిక్రయాలు, చెల్లింపుల సేవలు ఇలా వేర్వేరు రకాలుగా సాంకేతికతను వినియోగించేందుకు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ పోటీ పడాల్సిన పరిస్థితి. కరోనా కాలంలో ఈ కార్యకలాపాలు మరింతగా విస్తృతమయ్యాయి. అయితే డిజిటల్ అక్షరాస్యత లోపం కారణంగా చాలా మంది వీటి వినియోగించటంలో వెనుకపడుతున్నారు. డిజిటల్ సాక్షరత అభియాన్ లో భాగంగా కేంద్రం, కొన్ని స్వచ్చంద సంస్థల సాయంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

digital-services-increased-in-ap-during-the-corona-period
కరోనా కాలం.. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు..!

By

Published : Oct 2, 2020, 10:44 PM IST

కరోనా.. ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవన శైలిలోకి ఆధునిక సాంకేతికతను బలవంతంగా చొప్పించేసింది. ఆర్థిక కార్యకలాపాలతో పాటు రోజువారీ వ్యవహారాలను కూడా సాంకేతిక పరికరాలు, డిజిటల్ వ్యవస్థలు, మొబైల్ యాప్​లు, ఇతర ఆధునిక పరికరాలపై పూర్తిగా ఆధారపడుతున్న పరిస్థితి. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్ లాంటి సమాచార వినిమయంతో పాటు బ్యాంకింగ్ సేవల లాంటి ఆర్థిక కార్యకలాపాలు, క్రయవిక్రయాలు, విద్యాభ్యాసం, అధికారిక సమావేశాలు, రాజకీయ, ప్రభుత్వ సమావేశాలు, వినోదం, వైద్యంలో టెలిమెడిసిన్, డిజిటల్ పరికరాలు ఇలా రకరకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాధారణ జీవన శైలిలోకి చొచ్చుకొచ్చింది.

పెరిగిన డిజిటల్ లావాదేవీలు..

దేశవ్యాప్తంగా డిజిటల్ పరికరాల ద్వారా జరిగిన చెల్లింపులే కరోనా కాలంలో మూడింతలైనట్టుగా ఓ సర్వే చెబుతోంది. 2019-20లో 2 వేల 162 లక్షల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకే ఇది 3 వేల లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ డిజిటల్ చెల్లింపులు 7092 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం 16.2 కోట్ల మొబైల్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నట్టు గుర్తించారు. భారత్​లో మొబైల్ , ట్యాబ్​లు, ల్యాప్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ల ద్వారా అంతర్జాలాన్ని వినియోగిస్తున్న వారి సంఖ్య 56 కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

అన్నివర్గాల్లోనూ..!

కరోనా ప్రభావం కారణంగా అధికాదాయ వర్గాలతో పాటు అల్పాదాయ వర్గాలు కూడా తమ జీవన శైలిలోకి సాంకేతికతను చొప్పించినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్యపరమైన అంశాలు, విద్య, గృహావసరాలు, చెల్లింపుల్లోనూ, అలాగే రవాణా సదుపాయాలకు సబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజిటల్ పరికరాలను వినియోగించినట్టుగా తేలింది. ఈ పరికరాల వినియోగం నాలుగైదు నెలలు మాత్రమే అనుకున్నప్పటికీ.. కరోనా కొనసాగుతుండటంతో వాటి వినియోగమూ ఎడతెరపి లేకుండా సాగుతోంది.

పరిస్థితి కొద్దిగా మెరుగ్గానే ఉన్నా....!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబంగాల్, బిహార్, యూపీ లాంటి చోట్ల డిజిటల్ నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్నా.. గిరిజన ప్రాంతాల లాంటి మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యలు వేధిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

నాలుగైదేళ్లుగా దేశవ్యాప్తంగా డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిపోవటంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని అవసరాలను గుర్తించి వినియోగించేలా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ డిజిటల్ అక్షరాస్యతా మిషన్ ను 2017లోనే చేపట్టారు. గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్ కింద వరకూ 6 కోట్ల మందిని డిజిటల్ పరికరాల వినియోగంలో అక్షరాస్యులను చేయాలన్నది లక్ష్యం. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలూ, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటర్నెట్ వినియోగంలో భాగంగా గూగుల్​లో సెర్చ్ చేయటం, వాట్సాప్ లాంటి మాధ్యమాలు, కారు బుకింగ్, బ్యాంకింగ్ యాప్​ల వినియోగం , యూట్యూబ్ చూడటం, బీమ్ లాంటి యాప్ ద్వారా చెల్లింపులు డిజిటల్ పరికరాల ద్వారా నిర్విహించుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:పీవీసీ ఆధార్​కార్డు కోసం వెల్లువెత్తుతున్న ఆన్​లైన్​ దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details