తెలంగాణ

telangana

ETV Bharat / city

DIGITAL CLASSES: సర్కారు బడుల్లో సవాలుగా మారిన డిజిటల్​ పాఠాలు

డిజిటల్ పాఠాలను అందుకోవడానికి సర్కారు బడుల్లోని లక్ష మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 12 వేల 559 మంది విద్యార్థులకు పాఠాలు వినేందుకు టీవీలు, స్మార్ట్ ఫోన్లు కానీ లేవని విద్యా శాఖ గుర్తించింది. పంచాయతీ కార్యాలయాలు, తోటి విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు చూసేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, వాలంటీర్లే పిల్లల ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా సర్కారు బడుల్లోని సుమారు మూడొంతుల మంది విద్యార్థులు డిజిటల్ పాఠాలకు హాజరు కాలేదు. హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు తల్లిదండ్రులను సంప్రదిస్తున్నారు.

సర్కారు బడుల్లో సవాలుగా మారిన డిజిటల్​ పాఠాలు
సర్కారు బడుల్లో సవాలుగా మారిన డిజిటల్​ పాఠాలు

By

Published : Jul 3, 2021, 5:14 AM IST

సర్కారు బడుల్లో డిజిటల్ పాఠాలు సవాలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడొంతుల మంది విద్యార్థులు రెండు రోజులుగా డిజిటల్ పాఠాలకు హాజరు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల 457 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3 నుంచి 10వ తరగతి వరకు 18 లక్షల 57 వేల 183 మంది విద్యార్థులు ఉన్నారు. ఈనెల 1 నుంచి ప్రభుత్వం దూరదర్శన్, టీశాట్ ఛానెళ్లతో పాటు.. వాటికి సంబంధించిన యూట్యూబ్ ఛానెళ్లు, యాప్​ల ద్వారా బోధన ప్రారంభమైంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 68 శాతం హాజరే నమోదైంది. అన్ని పాఠశాలల్లో కలిపి 12 లక్షల 68 వేల 291 మంది డిజిటల్ పాఠాలు విన్నట్లు విద్యాశాఖ తెలిపింది. వారిలో 47 శాతం విద్యార్థులు అంటే 8 లక్షల 77వేల 909 మంది టీవీ పాఠాలు వినగా.. మరో 17 శాతం మంది 3 లక్షల 27 వేల 164 మంది స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్, కంప్యూటర్ ద్వారా విన్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడిచింది. అయితే ఎలాంటి డిజిటల్ పరికరాలు లేని విద్యార్థులు పాఠాలు వినేందుకు ఇబ్బంది పడుతున్నారు.

ప్రత్నామ్నాయ ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా లక్షా 12 వేల 559 మంది విద్యార్థులకు పాఠాలు వినేందుకు టీవీ, స్మార్ట్ ఫోన్ వంటి డిజిటల్ పరికరాలేవీ లేవని విద్యాశాఖ గుర్తించింది. అలాంటి 6 శాతం విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయాలు లేదా తోటి విద్యార్థుల ఇళ్లల్లో టీవీల్లో వినేలా ఏర్పాట్లు చేసింది. ఈనెల 2న 54 వేల 763 మంది ఇతర విద్యార్థుల ఇళ్లల్లో... 8 వేల 455 మంది పంచాయతీ కార్యాలయాల్లో టీవీ పాఠాలు విన్నట్లు విద్యాశాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, వాలంటీర్లను పిల్లల ఇంటికి పంపించి.. వారి ఫోన్లలో పాఠాలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల 185 మంది ఉపాధ్యాయులు, 2 వేల మంది వాలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి బోధించారని అధికారులు వెల్లడించారు.

సందేహాలు తీర్చేందుకు..

డిజిటల్ పాఠాలకు విద్యార్థుల హాజరును పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఉపాధ్యాయలు మాట్లాడుతున్నారని పేర్కొంది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా లక్షా 4వేల మంది విద్యార్థుల తల్లిందండ్రులతో ఉపాధ్యాయులు ఫోన్లలో సంప్రదించారని.. మరో 54 వేల మంది విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి మాట్లాడారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు పాఠశాల స్థాయిలో 54వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: KRISHNA BOARD: జలజగడం తీవ్రం... రంగంలోకి కృష్ణా యాజమాన్య బోర్డు

ABOUT THE AUTHOR

...view details