తెలంగాణ

telangana

ETV Bharat / city

Free Water Scheme: ఉచిత నీటి సరఫరా పథకం అమల్లో అవస్థలు.. వేలల్లో బిల్లులు - ఉచిత నీటి సరఫరా పథకం అమల్లో అవస్థలు.. వేలల్లో బిల్లులు

హైదరాబాద్ నగరంలో ఉచిత నీటి సరఫరా పథకం అమలు నత్తనడకన సాగుతోంది. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి కోసం.. ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోతుందని మొదట జలమండలి ప్రకటించడంతో నగర వాసులు ఆధార్ సీడింగ్ చేయించారు. కానీ ఇటీవల నల్లాలకు ఉన్న నీటి మీటర్లు పనిచేయకుంటే .. పథకం అమలు కాదని వెల్లడించడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ సీడింగ్ చేసినా నీటి మీటరు పనిచేయకపోవడంతో.. బిల్లులు వేలల్లో వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.

Difficulties in Free Water Scheme in hyderabad
Difficulties in Free Water Scheme in hyderabad

By

Published : Aug 17, 2021, 2:44 AM IST


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత తాగునీటి పథకం అమలు... నత్తనడకన సాగుతోంది. 2021 జ‌న‌వ‌రిలో జారీ చేసే డిసెంబ‌ర్ బిల్లు నుంచే ఈ ఉచిత పథ‌కం అమ‌ల్లోకి వస్తుందని.. 2020 డిసెంబ‌ర్ లో 20 వేల లీటర్ల వ‌ర‌కు నీటిని వాడుకున్నవారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని జలమండలి అప్పట్లో వెల్లడించింది. బస్తీల్లో మాత్రం నల్లాలకు మీటర్లు లేకున్నా.. డాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేస్తామని వెల్లడించింది. కానీ పలు కారణాలతో ఇప్పటికి అనేక మందికి ఉచిత నీటి ఫలాలు అందటం లేదు. గత 8 నెలలుగా ఊరిస్తున్న ఉచిత నీటి పథకంపై.. నగరవాసుల్లో అపోహలు తొలగిపోవట్లేదు.

వేలల్లో బిల్లులు...

ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోతుందని తొలుత అధికారులు చెప్పడంతో.. హడావుడిగా ఆధార్ నమోదు చేసుకున్నారు. కానీ మీటర్ పనిచేస్తుందో లేదో తెలియకపోవడంతో.. వచ్చిన బిల్లులను చూసి షాక్ తింటున్నారు. మీటరు పనిచేస్తున్నదని తెలుసుకోకపోతే.. ఒకేసారి 9 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు నగరవాసులను కలవర పెడుతుండగా.. ఉన్న పళంగా మీటర్ మార్పిడి సాధ్యం కాదని అటు వినియోగదారులు, జల మండలి అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సవరించిన నిబంధనల ప్రకారం.. ఆధార్ సీడింగ్ చేస్తే సరిపోదు. దాంతోపాటు పనిచేసే వాటర్ మీటర్ ఉంటే గానీ.. ఉచిత నీటి పథకం వర్తించదు. అయితే దీనికి గత 9 నెలలుగా గడువు పొడిగిస్తూనే వస్తున్నప్పటికీ... మీటర్ తప్పనిసరి విషయంలో స్పష్టమైన ఆదేశాలు, అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యమే నల్లా వినియోగదారులపై భారం పడేలా ఉంది. దీంతో ఆధార్ సీడింగ్ చేసుకుని నల్లాలకు ఉన్న మీటర్లు పనిచేయకపోవడంతో.. ఒకేసారి వేలల్లో వచ్చిన బిల్లులను చూసి ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ భారీగానే జలమండలి అధికారులకు ఫిర్యాదులు అందాయి.

అవగాహన కల్పించలేకపోయిన అధికారులు..

కొవిడ్‌ కారణంగా నగరంలో ఆధార్ సీడింగ్, నల్లా మీటర్లపై జలమండలి అధికారులు అవగాహన కల్పించలేకపోయారు. ఇటీవల నగరానికి చెందిన వారు.. కొందరు ఉచిత నీటి కోసం ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. కానీ వాటర్ బోర్డు సిబ్బంది బిల్లును జారీ చేశారు. దీంతో వారు జలమండలి అధికారులను దృష్టికి తేగా... నీటి మీటర్ పనిచేయని విషయం తెలియదనీ.. కనీసం దీనిపై అవగాహన కల్పించలేదని పేర్కొన్నారు. నగరంలో మొత్తం 10.9 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా.. ఇందులో కేవలం 6 లక్షల మందే నల్లా కనెక్షన్లతో ఆధార్ లింక్ చేసుకున్నారు. కనీసం లక్షన్నర నల్లాలకు మీటర్లు పనిచేయట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆధార్ సీడింగ్ చేసుకుని.. నల్లా మీటర్ లేని వారికి ఖచ్చితంగా బిల్లులను మరోసారి జారీ చేసే అవకాశం ఉంది. బిల్లుల భారం జనాలపై మోపకుండగా.. తప్పనిసరిగా మీటర్ బిగించుకునేందుకు మరో అవకాశమివ్వాలని.. జలమండలి అధికారులను నగర వాసులు కోరుతున్నారు. నీటి మీటర్ బిగించుకునేలోపు... కొంత జాప్యం జరిగినా... పెండింగ్ బిల్లులు గుదిబండగా మారకుండా చర్యలు తీసుకోవాలలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్

ABOUT THE AUTHOR

...view details