తెలంగాణ

telangana

ETV Bharat / city

జంతు ప్రేమికుల కోసం.. శాకాహార పాలు - different types of milk

‘నీరసంగా ఉంటుంది కదాని ఓ గ్లాసు పాలు తాగుదామంటే ఈ అరగని జబ్బేంటో...’ అని చాలామంది బాధపడుతుంటారు. ఆ మాట అక్షరసత్యం. కారణమేదయినాగానీ కొందరికి పాలల్లోని లాక్టోజ్‌ సరిపడదు. అలాగని పాల పదార్థాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరికీ జీర్ణమయ్యే రకరకాల శాకాహార పాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవేంటో... వాటిల్లోని పోషకాలేంటో తెలియాలంటే...

different types of vegan milk which are taken from trees
జంతు ప్రేమికుల కోసం.. శాకాహార పాలు

By

Published : Feb 21, 2021, 12:46 PM IST

పాలు పిల్లలకే కాదు, అన్ని వయసుల వాళ్లకీ సంపూర్ణ ఆహారమే. ఉదయాన్నే ఓ గ్లాసు పాలు తాగడం వల్ల శక్తి రావడంతోపాటు ఎముకల వృద్ధీ పనితీరూ బాగుంటుంది. అయితే ఆవు, గేదె, మేక... వంటి జంతు సంబంధిత పాలల్లోని లాక్టోజ్‌ పడకపోవడం వల్ల ఈమధ్య చాలామంది పాలకీ పాల పదార్థాలకీ దూరంగా ఉంటున్నారు. జంతువుల్ని ఏ రకంగానూ హింసించకూడదన్న కారణంతోనూ కొందరు సంపూర్ణ శాకాహారులు(వీగన్లు)గా మారి, జంతు సంబంధిత ఉత్పత్తుల్ని తీసుకోవడం మానేశారు. అలాంటివాళ్లందరికీ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమే ఈ శాకాహార పాలు. పైగా డెయిరీ పాలతో పోలిస్తే ఈ పాలల్లో కాల్షియం యాభైశాతం ఎక్కువ. ప్రొటీన్లూ పుష్కలమే. అదేసమయంలో డెయిరీ పాలల్లో కన్నా చక్కెర శాతం తక్కువ. అందువల్ల రక్తంలో గ్లూకోజ్‌ శాతం పెరగదు సరికదా, ఆవు- గేదె పాలతో పోలిస్తే అన్ని వీగన్‌ పాలల్లోనూ క్యాలరీలూ తక్కువే. నిజానికి శాకాహార పాలను ఎప్పటినుంచో వాడుతున్నప్పటికీ ఈమధ్య వాడకం పెరగడంతో వీటి మార్కెట్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షా ఇరవైవేల కోట్ల రూపాయలకు చేరింది. ఒక్క అమెరికాలోనే సగంమందికి పైగా మొక్కల నుంచి తీసిన పాలే తాగుతున్నారట. పిల్లల పాలపొడినీ పాలనీ కూడా వీటితో చేసినవే వాడుతున్నారు. స్టార్‌బక్స్‌ కంపెనీ ఓట్స్‌, కోకోనట్‌, ఆల్మండ్‌ మిల్క్‌లతో కాఫీ, టీలనూ విక్రయిస్తోంది. అందుకే వాటి కథాకమామీషు...

బాదం పాలు

బాదం పాలు

శాకాహార పాలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి బాదం పాలే. వీటిని మధ్యతూర్పు దేశాల్లో 13వ శతాబ్దంలో తయారుచేశారు. ఈ పాలల్లోని ఇ-విటమిన్‌ మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇతరత్రా యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉండటంతో బాదంపాలు క్యాన్సర్లనీ హృద్రోగాలనీ నిరోధిస్తాయి.ముఖ్యంగా ఇంట్లో తయారుచేసుకునే బాదం పాలల్లో కాల్షియం శాతం చాలా ఎక్కువ. మిల్క్‌షేక్‌లతోపాటు వీటిని కాఫీ, టీలకీ వాడుకోవచ్చు. సెరియల్స్‌ వేసుకుని తినడానికీ రుచిగా ఉంటాయి. మిగిలిన వేగన్‌ పాలతో పోలిస్తే బాదంలో తీపి శాతం ఎక్కువగా ఉండటంతో డెజర్ట్‌లూ స్మూతీల తయారీకీ బాగుంటాయి. అందుకే గత రెండు దశాబ్దాలుగా బాదం పాల మార్కెట్‌ ఊహించని విధంగా పెరిగి, సోయాని దాటిపోయిందట.

బాదం పాలు

వరి ధాన్యంతో..

వరి ధాన్యాల పాలు

జంతు ఉత్పత్తులే కాదు, సోయాలోని గ్లూటెన్‌ పడనివాళ్లకీ ఇవి ఎంతో మేలు. అన్ని రకాల వేగన్‌ పాలకంటే ఇవి బాగా పలుచగా ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో 89 శాతం నీరూ; 9 శాతం కార్బొహైడ్రేట్లూ; కొద్దిపాళ్లలో కొవ్వులూ ప్రొటీన్లూ; విటమిన్లూ ఖనిజాలూ ఉంటాయి. అందుకే ఇవి తేలికగానూ జీర్ణమవుతాయి. తేలికపాటి సూప్‌లూ సాస్‌ల తయారీకి చక్కగా సరిపోతాయివి. పలుచగా ఉండటం వల్ల చిక్కదనం కోసం కార్న్‌స్టార్చ్‌గానీ పిండి గానీ కలిపి బేకింగ్‌ ఉత్పత్తులకీ వాడుతుంటారు. ఇతర వేగన్‌ పాల మాదిరిగానే ఇవి కూడా వెనీలా, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి. జపాన్‌లో రైస్‌ మిల్క్‌ వాడకం ఎక్కువ. అక్కడ అమెజేక్‌ పేరుతో పులియబెట్టిన రైస్‌ మిల్క్‌ను ఆహారంలో భాగంగా ఎంతో ఇష్టంగా తాగుతుంటారు.

రైస్ మిల్క్

కొబ్బరితో..

కొబ్బరి పాలు

కొబ్బరిపాల వల్ల ఏ వంటకానికైనా అద్భుతమైన రుచి వస్తుందనేది తెలిసిందే. కూరలూ డెజర్ట్‌లే కాదు, ఐస్‌క్రీములూ పుడ్డింగులూ సూప్‌లూ స్ట్యూలూ స్మూతీలూ... ఇలా ఎందులో వేసినా ఆ రుచే వేరు అంటారు స్టార్‌ షెఫ్‌లు. కొబ్బరిలో శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కోకోనట్‌ క్రీమ్‌, మిల్క్‌, స్కిమ్‌ మిల్క్‌ అని మూడు విభాగాలుగా చేసి మరీ విక్రయిస్తున్నారు. అయితే కొబ్బరిపాలల్లోని కొవ్వుల్లో సగానికి పైగా లారిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ పెంచడానికే దోహదపడినప్పటికీ, మోతాదు మించకుండానే వాడాలని చెబుతారు. వీటిల్లో పొటాషియం, పీచు, ఐరన్‌ శాతం కూడా ఎక్కువే. అందుకే ఈమధ్య కొబ్బరిపాలు లేదా పొడితో చీజ్‌, కస్టర్డ్‌, జామ్‌ వంటివీ తయారుచేస్తున్నారు.

కొబ్బరి పాలు

సోయాతో..

సోయ పాలు

సోయా గింజల్ని నానబెట్టి రుబ్బాక, ఆ మిశ్రమాన్ని మరిగించి వడకట్టి పాలను తీస్తారు. సోయా పాలల్లోని పోషకాలు ఆవు పాలతో దాదాపు సమానంగా ఉంటాయి. వీటిని క్రీ.పూ. నుంచే తూర్పు ఆసియా దేశాల్లో ఆహారంలో భాగంగా వాడుతున్నారట. కానీ పాల రూపంలోనూ వాడటం ఇరవయ్యో శతాబ్దంలోనే అంతటా మొదలైంది. అప్పటినుంచీ యూరోపియన్లూ ఉత్తర అమెరికన్లూ కూడా సోయా పాలు ఇష్టంగా చప్పరించేస్తున్నారు. ఈ పాలల్లో ప్రొటీన్లూ కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత దగ్గర మరిగించినా విరిగిపోకుండా ఉంటాయి. దాంతో వీటిని కూరలూ, సాస్‌లూ, బేకరీ ఉత్పత్తులతోపాటు టీ, కాఫీలకీ వాడుతుంటారు. ఇక, పెరుగు, క్రీమూ వంటివి సరేసరి.

సోయా పాలు

జీడిపప్పుతో..

జీడిపప్పు పాలు

శాకాహారపాలల్లో కొత్తగా వచ్చి చేరిన ఈ పాలల్లో కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి అన్‌శాచ్యురేటెడ్‌వి కావడం వల్ల గుండె ఆరోగ్యానికీ మంచివే అంటున్నారు పోషక నిపుణులు. ప్రొటీన్లూ, విటమిన్లతోపాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శాతం కూడా వీటిల్లో ఎక్కువే. కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే మధుమేహులకీ మంచిదేనట. చిక్కదనం ఎక్కువగా ఉండటంవల్ల వీటిని వంటల్లోనే కాదు, బేకరీ ఉత్పత్తుల తయారీలోనూ వాడుతున్నారు. ఇందులోని మెగ్నీషియం నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. జీడిపప్పు పాలల్లోని ల్యూటెన్‌, జియాక్సాంథిన్‌లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వీటిల్లోని అనకార్డిక్‌ ఆమ్లం రక్తంలో చక్కెర నిల్వల్ని తగ్గిస్తుందని తేలడంతో డయాబెటిస్‌ రోగులకి గేదెపాలకన్నా ఇవి మేలు అంటున్నారు. క్యాన్సర్‌ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే గుణం కూడా ఈ ఆమ్లానికి ఉందట.

జీడిపప్పు పాలు

ఓట్స్‌ పాలు

ఓట్స్ పాలు

ఓట్స్‌ను పాల రూపంలో వాడటం 1990లలోనే మొదలైంది. స్వీడన్‌లోని లండ్‌ యూనివర్సిటీకి చెందిన రికర్డ్‌ ఓస్టె అనే శాస్త్రవేత్త లాక్టోజ్‌ అరగని వాళ్లకోసం రకరకాల ఉత్పత్తులతో ప్రయోగాలు చేస్తూ ఈ పాలను తయారుచేసి, ఓట్లే పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చాడట. అప్పటినుంచీ స్వీడన్‌ వాసులు వీటితో చేసిన కాఫీ, టీలనూ తాగేస్తున్నారు. ఆ తరవాత వీటి మార్కెట్‌ అమాంతంగా పెరిగింది. గత రెండేళ్లలో మరీనూ. ఇప్పుడు వేగన్‌ పాల వాడకంలో బాదం తరవాతి స్థానం ఓట్స్‌దే. పైగా ఓట్స్‌ పాలల్లో గాఢత తక్కువ. దాంతో త్వరగా జీర్ణమవుతాయి. ఇందులోని పీచు కొలెస్ట్రాల్‌ తగ్గడానికి దోహదపడుతుంది. క్రీముతో కూడిన సూప్‌లూ కూరలూ స్మూతీల తయారీకీ ఇవి బాగుంటాయి. పెరుగు, ఐస్‌క్రీమ్‌, చాకొలెట్ల తయారీలోనూ ఓట్‌ మిల్క్‌ను తెగ వాడేస్తున్నారట.

ఓట్స్ పాలు

ఇవే కాదు, పల్లీలు, బఠాణీ, బార్లీ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, అవిసెలు, గుమ్మడి, క్వినోవా... ఇలా రకరకాల గింజలూ ధాన్యాల నుంచి కూడా పాలను పిండేస్తున్నారు. కొన్ని కంపెనీలు బాదం-కొబ్బరి, బాదం- జీడిపప్పు... ఇలా ఒకటీ రెండూ మాత్రమే కాదు, ఏడెనిమిది రకాల్ని కలిపి కూడా పాలను తయారు చేస్తున్నాయి. సో, మున్ముందు వేగన్‌ పాల ఉత్పత్తులూ సూపర్‌మార్కెట్లలో కొలువుదీరనున్నాయన్నమాట.

ABOUT THE AUTHOR

...view details